‘ఎన్నికల కోడ్‌’ కూసింది.. అమల్లోకి వచ్చే రూల్స్ ఇవే

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది.

Update: 2024-03-16 16:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. దీన్నే మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ లేదా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అని అంటారు. రాజకీయ పార్టీలు, నాయకులు, అధికారులు ఎన్నికల కోడ్‌ను తప్పకుండా ఫాలో కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘానికి ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. పోలింగ్ తేదీలకు ముందు రాజకీయ పార్టీలు, నాయకులు చేయాల్సినవి, చేయకూడనివి ఏమిటి అనేది ఎన్నికల కోడ్ నిర్దేశిస్తుంది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ రూల్స్ ఉపయోగపడతాయి. ఎన్నికల ప్రచారం నుంచి మొదలుకొని పోలింగ్‌ తేదీ వరకు పార్టీలు, నేతలు ఈ నియామవళికి లోబడి వ్యవహరించాలి. షెడ్యూల్ ప్రకటించిన తేదీ మొదలు ఫలితాలు వెలువడే వరకు కోడ్‌ అమల్లో ఉంటుంది. ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

ఎన్నికల కోడ్ రూల్స్ ఇవీ..

* కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల ప్రచారంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఓటర్లను ప్రభావితం చేసేలా విధానపరమైన నిర్ణయాలు, ప్రాజెక్టులు, స్కీములు ప్రకటించకూడదు.

* అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజాధనాన్ని వాడకూడదు. మీడియాలో ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు.

* మంత్రులు ఎన్నికల ప్రచారంలో అధికారిక వాహనాలను వాడకూడదు. ఆ పర్యటనల్లో వారు ప్రభుత్వ అతిథి గృహాల్లో ఉండటానికి వీల్లేదు. బీకన్‌ లైట్లు కలిగి ఉన్న పైలట్‌ కార్లు (బుగ్గ కార్లు), తమ ఉనికిని తెలిపేలా సైరన్‌ ఉన్న వాహనాలను వాడకూడదు.

* ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లలో ఉన్న మంత్రులు, ఇతర రాజకీయ నాయకుల ఫొటోలు, రాజకీయ పార్టీల ప్రస్తావనలు మొదలైనవన్నీ తొలగించాలి.

* ఎటువంటి నియామకాలు కూడా చేపట్టకూడదు.

* రాజకీయ నేతలు ప్రత్యర్థి పనితీరుపై విమర్శలు చేయొచ్చు. అయితే వ్యక్తిగత దూషణలకు దిగకూడదు.

* కులం, మతం పేరుతో దూషించి ఎన్నికల్లో లబ్ధి పొందడం నియామావళికి వ్యతిరేకం.

* దేవాలయాలు, మసీదులు, చర్చిలు.. ఇలా ఏ ప్రార్థనా మందిరాన్ని కూడా ఎన్నికల ప్రచారం కోసం వినియోగించకూడదు.

* ఓటర్లను ప్రలోభం పెట్టడం, వారిని బెదిరించడం వంటివి కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తాయి.

* కులాల మధ్య, మతాల మధ్య, వివిధ భాషలు మాట్లాడే వారి మధ్య చిచ్చు పెట్టడం కోడ్‌ ఉల్లంఘనే అవుతుంది.

* రాత్రి 10 తర్వాత బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకూడదు.

* రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌ స్పీకర్లు వినియోగించాలంటే స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి.

* రాజ్యాంగంలోని ఆదర్శాలకు విరుద్ధంగా మ్యానిఫెస్టో ఉండకూడదు. పార్టీలు ఇచ్చే హామీల్లో హేతుబద్ధత ఉండాలి.

* ఎన్నికల పోలింగ్‌కు 48 గంటల ముందు తమకు ఓటేయాలంటూ ప్రచారం నిర్వహించకూడదు.

* పోలింగ్‌ తేదీ రోజు 100 మీటర్ల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం కూడా నేరంగా పరిగణిస్తారు.

* పోలింగ్ రోజున పోలింగ్‌ స్టేషన్లకు సొంత వాహనాల్లో ఓటర్లను తరలించకూడదు.

* కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ఒకవేళ పౌరులు అధిక మొత్తంలో నగదు లేదా విలువైన వస్తువులను తీసుకెళ్లాల్సి వస్తే.. వాటికి సంబంధించిన బిల్లులను వెంట తీసుకెళ్లడం మంచిది.

* ఎవరైనా ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘించినట్లు ఎన్నికల సంఘం భావిస్తే హెచ్చరికలు చేస్తుంది లేదా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తుంది. పార్టీ పై, అభ్యర్థిపై ఎఫ్ఐఆర్ రాయించగలదు.

* ఎన్నికల ప్రచారంలో పిల్లల్ని వాడకూడదు.

* స్టార్ క్యాంపెయినర్లకు ప్రత్యేక నియమాలున్నాయి. వాటిని వారు పాటించాల్సిందే.

ఎన్నికల కోడ్ చరిత్ర

1960లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు.. తొలిసారిగా ఎన్నికల నియమావళి అనేది అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో అధికారులు, రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఒక నియమావళిని పెట్టింది. అప్పటి నుంచి ఎన్నికలు జరిగిన ప్రతిసారీ కోడ్ అమలవుతూ, రకరకాల మార్పులను సంతరించుకుంది. అది ప్రస్తుతం అత్యంత కీలకమైనదిగా మారింది.

Tags:    

Similar News