Delhi: ఎంసీడీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను వాయిదా వేసిన ఢిల్లీ మేయర్
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) స్టాండింగ్ కమిటీలో చివరిగా ఖాళీగా ఉన్న స్థానానికి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్, కమిషనర్ అశ్వనీ కుమార్‌ను ఎన్నికలను నిలిపివేయాలని ఆదేశించారు.
దిశ, నేషనల్ బ్యూరో: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) స్టాండింగ్ కమిటీలో చివరిగా ఖాళీగా ఉన్న స్థానానికి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్.. కమిషనర్ అశ్వనీ కుమార్‌ను ఎన్నికలను నిలిపివేయాలని ఆదేశించారు. దీనిని అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, శుక్రవారం స్టాండింగ్ కమిటీ సభ్యుని ఎన్నిక జరుగుతుందని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గత రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్డర్ చట్టవిరుద్ధం. సభ పనితీరులో జోక్యం చేసుకునే అధికారం ఎల్‌జీకి లేదు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు.
ఎల్‌జీ జారీ చేసిన నోటీసులు చాలా మంది కౌన్సిలర్లకు అందలేదు. తాము ఊరిలో లేమని, సభ సమయానికి చేరుకోలేమని సభ్యులు నాకు తెలియజేశారు. కొంతమంది కౌన్సిలర్‌లకు శుక్రవారం ఉదయం 10 గంటల వరకు కూడా మీటింగ్ నోటీసు అందలేదు. ఇంత తక్కువ టైంలో వారు సమావేశానికి హాజరు కావాలని ఆశించడం ప్రజా ప్రతినిధులుగా వారి ఎన్నికల హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని మేయర్ అన్నారు.
నియమాలు, నిబంధనలు సరిగ్గా పాటించకుండా ఎన్నికలను నిర్వహించడం వల్ల సంస్థపై, దాని న్యాయబద్ధతపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుంది. ఈ మేరకు అక్టోబర్ 5న న్యాయబద్ధంగా ఎన్నికను నిర్వహించాలని కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు ఆమె చెప్పారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 27న మధ్యాహ్నం 1 గంటకు ఎన్నికను నిర్వహించాలని గురువారం ఎల్‌జీ MCD కమీషనర్‌కు ఉత్తర్వు జారీ చేశారు. కానీ మేయర్ తాజాగా దానిని వాయిదా వేశారు.