Landslide: రియాసిలో విరిగిపడిన కొండచరియలు.. ఇద్దరు మహిళా యాత్రికులు మృతి

కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మహిళా యాత్రికులు మృతి చెందారు. మరో బాలిక తీవ్రంగా గాయపడింది.

Update: 2024-09-02 11:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మహిళా యాత్రికులు మృతి చెందారు. మరో బాలిక తీవ్రంగా గాయపడింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 2:35 గంటల ప్రాంతంలో వైష్ణో దేవి మందిరానికి మూడు కిలోమీటర్ల దూరంలో అకస్మాత్తుగా కొండచరియలు విరిగి ఆలయానికి వెళ్లేందుకు ఇటీవల నిర్మించిన కొత్త ట్రాక్‌పై పడ్డాయి. దీంతో ఆ ట్రాక్ పై వెళ్తున్న ఇద్దరు మహిళలు మరణించగా.. ఓ బాలిక తీవ్రంగా గాయపడినట్టు రియాసీ డిప్యూటీ కమిషనర్ విశేష్ పాల్ మహాజన్ తెలిపారు. విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఆలయానికి వెళ్లే టూరిస్టులను నిలిపివేశారు. యాత్రికులు జాగ్రత్తగా ఉండాలని, పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగాలని వైష్ణోదేవీ ఆలయ బోర్డు తెలిపింది. కాగా, 2022లోనూ నూతన సంవత్సరం రోజే మందిరం వద్ద జరిగిన తొక్కిసలాటలో 12 మంది యాత్రికులు మరణించగా, 16 మంది గాయపడ్డారు.


Similar News