రాజకీయాల్లోకి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె! తండ్రి ఇలాకాలో బరిలోకి?
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశంలో వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకుల పిల్లలు ఎన్నికల బరిలోకి దిగుతున్నారని తెలుస్తోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశంలో వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకుల పిల్లలు ఎన్నికల బరిలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సమాచారం. ఆర్జేడీ తరపున ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు పార్టి వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ కుమార్ సింగ్ సోషల్ మీడియాలోతో సింగపూర్‌లో ఉన్న ఆచార్య రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నారనే ఊహాగానాలకు దారితీసింది.
తండ్రి ఇలాకా నుంచే బరిలోకి?
డాక్టర్ రోహిణి ఆచార్య తన తండ్రి పట్ల అపారమైన ప్రేమ, భక్తి , అంకితభావానికి ప్రతిరూపమని ఆయన తెలిపారు. 2009లో లాలూ ప్రసాద్ యాదవ్ పోటీ చేసిన సరన్ ఎంపీ నియోజకవర్గం నుంచి రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థిగా డాక్టర్ రోహిణి ఆచార్యను ప్రకటించాలని సరన్ డివిజన్‌లోని పార్టీ కార్యకర్తలందరి హృదయపూర్వక కోరిక అని తెలిపారు. దీంతో ఆమె పోటీ చేయాలని పార్టీ శ్రేణులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు. కాగా, ఇటీవల పాట్నాలోని గాంధీ మైదానంలో ఆర్జేడీ నిర్వహించిన ర్యాలీలో రోహిణి కూడా పాల్గొన్నారు. దీంతో ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
రోహిణి ఆచార్య ఎవరు?
రోహిణి ఆచార్య ఎంబీబీఎస్ డాక్టర్, లాలూ ప్రసాద్ యాదవ్ స్నేహితుడు, రిటైర్డ్ ఆదాయపు పన్ను అధికారి రాయ్ రణ్‌విజయ్ సింగ్ కుమారుడు సమ్రేష్ సింగ్ ను 2022లో వివాహం చేసుకుంది. భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్, వీరికి ఇద్దరు కుమారులు. గత రెండు దశాబ్దాలుగా వీరు విదేశాల్లోనే ఉంటున్నారు. కాగా, 2022లో లాలూ ప్రసాద్ యాదవ్‌కు తన కిడ్నీని దానం చేసి రోహిణి వార్తల్లో నిలిచారు. గతంలో సైతం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీస్తారనే ఊహాగానాలు వినిపించాయి. నేడు మరోసారి రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే టాక్ నడుస్తోంది.
===