ఈ ఫ్యామిలీ రూటే సెపరేటు.. 60 మంది కలిసి ఒక్కరికే ఓటు

లాల్ జీ సోలంకి అనే గుజరాత్ కుటుంబంలోని వ్యక్తులందరూ ఒక్కరికే ఓటేస్తారు

Update: 2022-12-01 05:57 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల టైంలో పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికి తెలుసు. ముఖ్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థుల పాట్లు మామూలుగా ఉండవు. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకే ఓటర్లలో చీలికలు వస్తుంటాయి. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వేరువేరు పార్టీలకు ఓటేస్తుంటారు. భర్తను కాదని భార్య, తండ్రిని కాదని కొడుకు, అత్తను కాదని కోడలు.. ఇలా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వేరు వేరు పార్టీలకు ఓటు వేస్తుంటారు. కానీ గుజరాత్ కు చెందిన ఓ కుటుంబం మాత్రం ఇందుకు విరుద్ధం. 81 మంది సభ్యులు గల ఆ కుటుంబం.. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కలిసికట్టుగా ఒకే పార్టీకి ఓటేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఫ్యామిలీ ఇప్పడు దేశవ్యాప్తంగా పాపలర్ అయ్యింది. ఇక వివరాల్లోకి వెళ్తే..

1885లో లాల్ జీ సోలంకి అనే వ్యక్తి లఖియాన్ నుంచి తన ఐదుగురి సోదరులతో కలిసి సూరత్ లోని కామ్రేజ్ ప్రాంతానికి వచ్చారు. వృత్తి రీత్యా కమ్మరి కులానికి చెందిన సోలంకి సోదరులు.. అదే వృత్తిని చేసుకుంటూ ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నారు. క్రమంగా ఈ కుటుంబం పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ కుటుంబంలో చిన్నాపెద్దా అంతా కలిపి 81 మంది దాకా ఉన్నారు. ఇందులో ఓటు హక్కు కలిగినవారు 60 మంది ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా వీళ్లు ఏ కార్యక్రమం చేసినా కలిసికట్టుగానే చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో వీళ్లంతా ఒకే వ్యక్తికి ఓటేస్తారు. ఎలాంటి చీలికలు ఉండవు. పోలింగ్ కేంద్రానికి కూడా అందరూ ఒకేసారి వెళ్తారు. పోలింగ్ కేంద్రం వద్ద కుటుంబ సభ్యులంతా వరుసగా క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇవాళ గుజరాత్ అసెంబ్లీ మొదటి దశ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయమే ఇప్పుడు వీళ్ల గురించి దేశానికి తెలిసేలా చేసింది.

మొత్తం 60 మంది ఓటర్లలో షంజీబాయి (82) అత్యధిక వయసు గల ఓటరు కాగా.. ఆయన మనవళ్లు పార్థ్, వేదాంత్ ఇటీవలే ఓటు హక్కు పొందారు. ''82 ఏళ్ల వయసులో కూడా మా నాన్న షంజీబాయి ఓటేయడానికి చాలా ఉత్సుకత చూపుతారు'' అని సోలంకి కుమారుడు నందలాల్ చెబుతున్నాడు. ఇక ఓటేయడాన్ని తాము ఓ పండగలా జరుపుకుంటామని, అందరం కలిసి ఒకే పార్టీకి ఓటేస్తామని కుటుంబానికి చెందిన ఘన్ శ్యాం అనే వ్యక్తి తెలిపాడు. తమను చూసి ఉమ్మడి కుటుంబానికి ఒక్కరి మారినా తాము సంతోషిస్తామని ఘన్ శ్యాం ఆశాభావం వ్యక్తం చేశాడు. అందరం కలిసి 'జ్యోతి' అనే వ్యవసాయ పనిముట్లలను తయారు చేసే కర్మాగారాన్ని ఏర్పాటు చేశామని సోలంకి కుటుంబంలో ఒకరైన ప్రదీప్ చెప్పాడు. ఉమ్మడి కుటుంబంలో ఉండడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని, సంతోషం.. బాధ ఇలా ఏదొచ్చినా కుటుంబ సభ్యులందరూ తోడుగా ఉంటారని నిరాలి చెప్పింది. ఫ్యామిలీలో దాదాపు అందరం ఒకే ఇంట్లో నివసిస్తున్నామని వారు చెబుతున్నారు. ఇన్ని చెబుతున్న ఈ కుటుంబ సభ్యులు ఓటు ఎవరికి వేస్తున్నామనేది మాత్రం చెప్పడం లేదు. అది టాప్ సీక్రెట్ అని వారు అంటున్నారు. ఏది ఏమైనా ఆధునిక ఈ ప్రపంచంలో ఇలాంటి ఓ కుటుంబం ఉండటం నిజంగా గ్రేట్ అని పలువురు ఆ కుటుంబాన్ని ప్రశంసిస్తున్నారు. 


Similar News