Kolkata Rape Case: కోల్‌కతా మెడికో హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఘటన జరిగిన తర్వాత సెమినార్ హాల్లో సందడి!

కోల్‌కతా ఆర్జీకర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది.

Update: 2024-08-28 04:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా ఆర్జీకర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ చేసిన దురాగతం దేశాన్ని.. దేశ ప్రజల్ని కదిలించేసింది. అతడికి కఠిన కారాగార శిక్ష విధించాలని కోరుతూ ఇప్పటికే దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. కాగా ఈ కేసులో బిగ్ ట్విస్ట్ ఒకటి చోటుచేసుకుంది. ఘటన జరిగిన తర్వాత సెమినార్ హాల్లోకి అనేక మంది వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఈ కేసుపై మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ వీడియోలో మెడికోపై అత్యాచారం, హత్య ఘటన తర్వాత డాక్టర్ దేబాశిష్ సోమ్ (సందీప్ ఘోష్ సన్నిహితుడు, ఆర్జీ కర్ ఆస్పత్రి ఫోరెన్సిక్ విభాగం వైద్యుడు), పోలీసులు, ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ న్యాయవాది శంతన డే, ఘోష్ పీఏ, ఆస్పత్రి ఔట్ పోస్టు సిబ్బంది సెమినార్ హాల్లో కనిపించారు. వీరంతా ఏదో విషయాన్ని చర్చించుకోవడం కనిపించింది. అయితే, ఈ వీడియోలో బాధిత వైద్యురాలి మృతదేహం మాత్రం కనిపించకపోవడం గమనార్హం. అయితే, ఇప్పుడు ఈ వీడియో అనేక అనుమానాలకు, ప్రశ్నలకు తావిస్తుంది. వీరందరూ కలిసి ఆధారాలను చెరిపివేసే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు వారందరూ ఆ గదిలోకి ఎందుకు వెళ్లారు. ఏం చర్చించుకుంటున్నారన్న విషయం మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. అదే సమయంలో వైరల్ అవుతున్న ఈ వీడియో పై డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఇందిరా ముఖర్జీ స్పందించారు.

ఆమె మాట్లాడుతూ.. పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు, సంబంధిత వ్యక్తులు మాత్రమే లోపలికి వెళ్లారని, అది కూడా నిషేధిత ప్రాంతంలోకి వెళ్లలేదని పేర్కొన్నారు. మరి లాయర్ అక్కడ ఎందుకు ఉన్నారన్న ప్రశ్నకు మాత్రం ఆమె సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. ఈ విషయం గురించి ఆస్పత్రి అధికారులు మాత్రమే చెప్పగలరని పేర్కొన్నారు.


Similar News