Kiran riiju: ఆ బాధ్యతను మమతా బెనర్జీ విస్మరించారు.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

ట్రైనీ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య కేసులో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర మంత్రి రిజిజు విమర్శించారు.

Update: 2024-09-04 16:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ట్రైనీ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య కేసులో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. 2021లో లేఖ రాసినప్పటికీ పెండింగ్‌లో ఉన్న లైంగిక దాడి, పోక్సో చట్టం కేసుల విచారణను వేగవంతం చేయడానికి ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయడంలో సీఎం విఫలమయ్యారని ఆరోపించారు. మహిళలు, పిల్లలకు సత్వర న్యాయం అందించే అత్యంత పవిత్రమైన బాధ్యతను సీఎం విస్మరించడం బాధాకరమని తెలిపారు. ఈ మేరకు మమతా బెనర్జీకి గతంలో రాసిన లేఖను బుధవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 100 కంటే ఎక్కువ కేసులు నమోదైన జిల్లాల్లో ఒక ప్రత్యేకమైన పోక్సో కోర్టును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. లైంగిక దాడి వంటి క్రూరమైన నేరాలను ఎదుర్కోవటానికి పార్లమెంటు ఇప్పటికే 2018లో కఠినమైన చట్టాన్ని ఆమోదించిందని తెలిపారు. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. క్రిమినల్ లా (సవరణ) చట్టం 2018కి అనుగుణంగా న్యాయ శాఖ ఈ కేంద్ర ప్రాయోజిత ఎఫ్‌టీఎస్‌సీ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.


Similar News