సక్సెస్ సీక్రెట్ బయటపెట్టిన ప్రధాని మోడీ.. ఎన్నికల వేళ సంచలన వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బీజేపీ జాతీయ మండలి సమావేశం నిర్వహించారు.

Update: 2024-02-18 09:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బీజేపీ జాతీయ మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ.. వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం అని అన్నారు. మైనారిటీలు, మెజారిటీలు కాదని.. అణగారిన ప్రజల అభివృద్ధే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని చెప్పారు. గుజ్జర్ ముస్లిం అభ్యర్థిని రాజ్యసభకు పంపిన ఘనత బీజేపీకి ఉందని గుర్తుచేశారు. కర్తార్ పూర్ సాహిబ్‌ సందర్శనకు వెళ్లాలన్న కల సాకారం చేసింది కూడా తమ ప్రభుత్వమే అని చెప్పారు. సరిహద్దు నుంచి టెలీస్కోపులో కర్తార్ పూర్ సాహిబ్ చూసే పరిస్థితి నుంచి నేడు నేరుగా వెళ్లి చూసేంత బలంగా బీజేపీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందిందని అన్నారు. పశ్చిమ దేశాలతో దేశ సంబంధాలు ఇంతకుముందు కంటే ఎంతో బలోపేతమయ్యాయని తెలిపారు.

ప్రస్తుతం పశ్చిమాసియ దేశాలు మనకు మిత్ర దేశాలుగా కొనసాగుతున్నాయని అన్నారు. పాకిస్తాన్ అంశాన్ని పక్కనబెట్టి పశ్చిమాసియా దేశాలతో నూతన సంబంధాలు నెలకొల్పినట్లు చెప్పుకొచ్చారు. తాము మూడోసారి తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీంట్లో ఎవరికీ ఎలాంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. రాజకీయ పండితులెవరికీ బీజేపీ గెలుపు కారణాలు దొరకవు అని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను దేశ వీధుల వెంట తిరుగుతున్నప్పుడు ప్రజల ఆశీర్వాద వర్షం కురిసిందని అన్నారు. ఆ ఆశీర్వాదాన్ని రాజకీయ పండితులు తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతీయ మూలసూత్రమని.. అలాంటి భిన్నత్వంలో ఏకత్వంగానే పనిచేస్తున్నట్లు తెలిపారు. ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ అనేది తమ నినాదంగా చెప్పారు. సంపూర్ణ భారత్, సమృద్ధ భారత్ బీజేపీ లక్ష్యమని అన్నారు.

ఎప్పుడైనా ప్రజలు నిజాయితీని, సుపరిపాలనను ఆదరిస్తున్నారని తెలిపారు. నిరంతర త్యాగాల వల్లే పార్టీ విస్తరణ, ప్రజల విశ్వాసం చూరగొనగలుగుతున్నామని వెల్లడించారు. ప్రతిపక్షం అని చెప్పుకునే పార్టీలన్నీ కుటుంబ పార్టీలే అని ఎద్దేవా చేశారు. అధికారం చుట్టూ కుటుంబ సభ్యులే ఉంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో అధికారం వారసత్వంగా సంక్రమిస్తోందని కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో దేశ రూపురేఖలు మారిపోయాయని అన్నారు. పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. వచ్చే వంద రోజులు మనకు మరింత కీలకమని పార్టీ నేతలకు సూచించారు. నవ భారత్ నిర్మాణం కోసం అందరం కలిసిగట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలు ప్రతీ ఇంటికి, ప్రతీ కార్యకర్త వద్దకు వెళ్లాలని చెప్పారు. దేశ అభివృద్ధిపై ఏనాడూ కాంగ్రెస్‌కు పట్టిలేదని అన్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.

Tags:    

Similar News