Ministers: మహరాష్ట్ర నుంచే ఆ విధానానికి చెక్ పడాలి
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) నాందేడ్ నియోజకవర్గంలో పర్యటించారు.
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) నాందేడ్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ఇండియా కూటమి గెలవడం వలన, భవిష్యత్‌లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) పీఎం అయ్యేందుకు మార్గం సులువుగా ఉంటుందని అన్నారు. దేశ వ్యాప్తంగా కార్పొరేట్ పాలన పోవాలని, మహరాష్ట్ర నుంచే ఆ విధానానికి చెక్ పడాలని వివరించారు. పేదోళ్ల కడుపు కొట్టి, పెద్దోళ్లకు పెద్దపీఠ వేస్తున్న మోడీ, అమిత్‌షాల బీజేపీని పాతరేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కాపాడాలంటే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.
గతంలో బీజేపీ ప్రజాస్వామ్యంలోని ప్రజల తీర్పును కించపరిచిందని, మహారాష్ట్రలో ప్రభుత్వాలను ఏ విధంగా కూల్చారో? మరోసారి గుర్తు చేసుకోవాలని కోరారు. ప్రజల అభిప్రాయాలను తుంగలో తొక్కి, కార్పొరేట్ వ్యవస్థను పెంచేందుకు బీజేపీ ఏక్ నాథ్ షిండేలను తయారు చేసిందన్నారు. ఇప్పుడు ఏ రాష్ట్రంలోకి వెళ్లినా, ప్రభుత్వాలను కూల్చాలంటే ఏక్ నాథ్‌షిండే రావాలని వ్యంగ్యంగా విమర్శలు చేస్తున్నారని వివరించారు. ఇది మహారాష్ట్రకు అగౌరవంగా ఉన్నదన్నారు. కాంగ్రెస్ కూటమి అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.