Wayanad Landslides: జలవిలయం బాధితుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

కేరళలోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితుల కోసం కేరళ ప్రభుత్వం చర్యలకు పూనుకుంది.

Update: 2024-08-08 04:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితుల కోసం కేరళ ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు పినరయి సర్కారు ప్రకటించింది. కేరళ రాష్ట్ర రెవెన్యూ మంత్రి కె.రాజన్ ఈ విషయాన్ని వెల్లడించారు. సహాయక శిబిరాల్లో ఉన్న ప్రజలకు తాత్కాలిక పునరావాసం కల్పించే అంశంపై కలెక్టరేట్‌లో కేబినేట్ సబ్ కమిటీ సభ్యులు అధికారులతో భేటీ అయినట్లు పేర్కొన్నారు. సహాయక శిబిరాల్లో, బంధువుల ఇళ్లలో, ఆస్పత్రుల్లో ఉన్నవారందిరకీ సాయం చేస్తామని తెలిపారు. పునరావాస పథకంలో చేరేందుకు శిబిరాల వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాలన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల నుండి వచ్చిన కచ్చితమైన డేటా ఆధారంగా పునరావాస ప్యాకేజీని తయారు చేస్తామన్నారు. శిబిరాల్లో ఎవరు నివసిస్తున్నారు అనే దాని ఆధారంగా కాదని చెప్పారు. శిబిరాల్లో ఉన్నవారికే సాయం అందుతుందన్న ప్రచారం నిజం కాదన్నారు.

తాత్కాలిక చర్యల వివరాలు ఇవే..

ప్రస్తుతం తీసుకున్న తాత్కాలిక చర్యల వివరాలను మంత్రి కె. రాజన్ తెలిపారు. వివిధ పాఠశాలల్లోని తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి తాత్కాలిక పునరావాసం ఏర్పాటు చేశామన్నారు. అయితే, వారిని ఖాళీగా ఉన్న ఇళ్లు, క్వార్టర్లు, ఫ్లాట్లు, హాస్టళ్లకు తరలిస్తామ్ననారు. వాటిని గుర్తించాలని స్థానిక సంస్థలను ఆదేశించినట్లు తెలిపారు. తాత్కాలిక పునరావాసం కోసం ప్రభుత్వ క్వార్టర్లు, హోటళ్లను కూడా ఉపయోగించుకుంటామని మంత్రి తెలిపారు. శిబిరాలు నిర్వహిస్తున్న పాఠశాలల్లో తరగతులను పునఃప్రారంభించేందుకు కూడా ఇది దోహదపడుతుందని తెలిపారు. పునరావాసం కోసం మొదటగా విపత్తు ప్రభావిత ప్రాంతాలకు సమీపంలోని పంచాయతీల్లో ఖాళీగా ఉన్న ఇళ్లు, ప్రభుత్వ క్వార్టర్లు, హోటళ్లు, హోమ్‌స్టేలు, హాస్టళ్లను పరిశీలిస్తామని తెలిపారు. శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలను దశలవారీగా సురక్షితంగా తరలించాలన్నదే ప్రభుత్వ యోచన అని మంత్రి తెలిపారు. ఇకపోతే, తొమ్మిదో రోజు కూడా సహాయకచర్యలు కొనసాగాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయకచర్యలు జరుగుతున్నాయి.


Similar News