Kerala: వివాదాస్పద ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి.. సీఎస్ కు సీఎం ఆదేశాలు

కేరళ ప్రభుత్వం విడుదల చేసిన వివాదాస్పద ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఆదేశించారు.

Update: 2024-08-02 05:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేరళ ప్రభుత్వం విడుదల చేసిన వివాదాస్పద ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఆదేశించారు. కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వేణుకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. వయనాడ్ లో ప్రకృతి విలయంపై సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ లో తమ అభిప్రాయాన్ని తెలపడంపై నిషేధం విధిస్తూ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని సీఎస్ ని సీఎం ఆదేశించారు. "రాష్ట్ర ప్రభుత్వానికి అలాంటి విధానం లేదు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకున్నా. అటువంటి అపార్థాన్ని సృష్టించిన ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని సంబంధిత అధికారికి చెప్పాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించా" అని పినరయి విజయన్ అన్నారు.

కేరళ విపత్తు నిర్వహణ ఏం చెప్పిందంటే?

వయనాడ్‌లోని మెప్పాడి పంచాయతీలో క్షేత్ర పర్యటనలు చేయవద్దని విపత్తు నిర్వహణ ప్రిన్సిపల్ సెక్రటరీ టింకు బిస్వాల్ ఆదేశాలు జారీ చేశారు. వయనాడ్‌ను విపత్తు ప్రాంతంగా ప్రకటించడం తప్పుదారి పట్టిస్తోందని పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ లు తమ అభిప్రాయాలు, అధ్యయన నివేదికలను మీడియాతో పంచుకోవద్దని సూచించారు. విపత్తు ప్రభావిత ప్రాంతంలో ఏవైనా అధ్యయనాలు చేపట్టడానికి కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు.


Similar News