కేరళ సీఎం పినరయి విజయన్‌కు షాక్ ఇచ్చిన హైకోర్టు

అవినీతి ఆరోపణలకు సంబంధించి కేరళ సీఎం పినరయి విజయన్‌, ఆయన కుమార్తె టి వీణపై కాంగ్రెస్‌ శాసనసభ్యుడు మాథ్యూ కుజల్‌నాదన్‌ దాఖలు చేసిన పిటిషన్‌‌ను మంగళవారం విచారించిన కేరళ హైకోర్టు వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.

Update: 2024-06-18 10:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేరళ సీఎం పినరయి విజయన్‌, ఆయన కుమార్తె టి వీణపై కాంగ్రెస్‌ శాసనసభ్యుడు మాథ్యూ కుజల్‌నాదన్‌ దాఖలు చేసిన పిటిషన్‌‌ను మంగళవారం విచారించిన కేరళ హైకోర్టు వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. అలాగే, సీఎం కుమార్తెకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌కు కూడా నోటీసులు పంపించాలని పేర్కొంటూ కేసును జులై 2కి వాయిదా వేసింది. 2018-19 మధ్య వీణకు చెందిన ఐటీ సంస్థ ఎక్సాలాజిక్, కొచ్చికి చెందిన మైనింగ్ సంస్థ కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (సీఎమ్‌ఆర్‌ఎల్) నుండి అక్రమంగా 1.72 కోట్లు పొందిందనే ఆరోపణలు వచ్చాయి. ఎక్సాలాజిక్ సంస్థ, కొచ్చిన్ మినరల్స్‌కు ఎలాంటి సేవలు అందించకుండానే ఈ మొత్తాన్ని అందుకుందని సీఎం పినరయి విజయన్, ఆయన కూతురు లంచం తీసుకున్నారని మాథ్యూ కేసు వేశారు. అలాగే, సీఎం మద్దతుతో సంబంధిత చట్టాలు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా సీఎంఆర్‌ఎల్ అక్రమ మైనింగ్‌ చేస్తుందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి, ఆయన కుమార్తెపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ చేసిన పిటిషన్‌ను విజిలెన్స్ కోర్టు తిరస్కరించడంతో మాథ్యూ కుజల్‌నాదన్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా మంగళవారం విచారణలో భాగంగా ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ముఖ్యమంత్రి విజయన్, వీణకు నోటీసులు పంపాలని ఆదేశించింది. ఇదే విధమైన అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రి విజయన్‌పై గతంలో కొచ్చి నివాసి పిటిషన్ దాఖలు చేశారు, ఆ తరువాత పిటిషనర్ మరణించారు. దీంతో హైకోర్టు రెండు పిటిషన్లు ఒకేలా ఉన్నప్పటికీ విడివిడిగా విచారిస్తామని తెలిపింది. కోర్టు విచారణ తరువాత మీడియాతో మాట్లాడిన మాథ్యూ కుజల్‌నాదన్ .. ఇది సాధారణ ప్రక్రియ అని, తదుపరి విచారణ కోసం వేచి చూస్తామని అన్నారు.


Similar News