Kejriwal: ప్రభుత్వాలను పడగొట్టడం సరైందేనా?.. మోహన్ భగవత్‌కు కేజ్రీవాల్ లేఖ

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ బుధవారం లేఖ రాశారు.

Update: 2024-09-25 12:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌కు ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ బుధవారం లేఖ రాశారు. బీజేపీ చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మోడీ పదవీ విరమణ సహా అనేక అంశాలపై పలు ప్రశ్నలు సంధించారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై తాను చాలా ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. బీజేపీ ప్రభుత్వ విధానాలు దేశానికి హానికరమని, ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి ప్రముఖ నాయకులకు వర్తింపజేసిన ఆర్‌ఎస్‌ఎస్ పదవీ విరమణ వయస్సు ప్రస్తుతం 73 ఏళ్ల వయసులో ఉన్న ప్రధాని మోడీకి కూడా వర్తిస్తుందా? అని ప్రశ్నించారు.

‘కొందరు నేతలను స్వయంగా ప్రధాని మోడీ, అమిత్ షాలు అవినీతిపరులని ఆరోపించారు. అనంతరం కొద్దిరోజుల తర్వాత వారిని బీజేపీలో చేర్చుకున్నారు. అలాంటి బీజేపీని ఆర్‌ఎస్‌ఎస్ ఊహించిందా? ఇదంతా చూస్తుంటే మీకు బాధ అనిపించలేదా? అని మోహన్ భగవత్‌ను ప్రశ్నించారు. ‘ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను అస్థిరపర్చి, వాటి స్థానంలో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ ఆచారం ఆర్‌ఎస్‌ఎస్ విలువలకు అనుకూలమేనా సమాధానం చెప్పాలి’ అని తెలిపారు. ‘లోక్‌సభ ఎన్నికల టైంలో బీజేపీకి ఆర్ఎస్ఎస్ మద్దతు అవసరం లేదని బీజేపీ చీఫ్ నడ్డా చెప్పారు. ఈ ప్రకటనతో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు బాధపడలేదా. దీనిపై మీ స్పందన తెలియజేయండి’ అని పేర్కొన్నారు. లేఖలో తాను లేవనెత్తిన ప్రశ్నలకు మోహన్ భగవత్ సమాధానం ఇస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. 


Similar News