కేజ్రీవాల్‌ను టెర్రరిస్టులా ట్రీట్ చేస్తున్నారు: ఢిల్లీ సీఎంతో భేటీ అనంతరం భగవంత్ మాన్ వ్యాఖ్యలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సోమవారం భేటీ అయ్యారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సోమవారం భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తో్ంది. భేటీ అనంతరం భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జైలు అధికారులు కేజ్రీవాల్‌ను ఉగ్రవాదిలా ట్రీట్ చేస్తున్నారని ఆరోపించారు. కఠినమైన నేరస్తులను లభించే సౌకర్యాలు కూడా కేజ్రీవాల్‌కు అందించకపోవడం బాధాకరమన్నారు. దేశంలోనే అతి పెద్ద ఉగ్రవాదుల్లో ఒకరిని పట్టుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేజ్రీవాల్‌తో భేటీ భిన్నమైన రీతిలో సాగిందని, గదిలో ఒక అద్దం ఉండగా అక్కడి నుంచే కేజ్రీవాల్‌తో మాట్లాడానని అందులో కేజ్రీవాల్ ముఖం కూడా స్పష్టంగా కనిపించలేదని తెలిపారు. పంజాబ్‌లోని పరిస్థితుల గురించే కేజ్రీవాల్‌తో చర్చించినట్టు చెప్పారు. లోక్ సభ ఫలితాల అనంతరం ఆప్ పెద్ద శక్తిగా అవతరిస్తుందని దీమా వ్యక్తం చేశారు.