5 గ్యారంటీలపై కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారంటీలపై స్వంత పార్టీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారంటీలపై స్వంత పార్టీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఐదు గ్యారంటీల" ఎన్నికల హామీతో కర్ణాటక ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసిన సంగతి అందరికీ తెలిసిందే. అదే ఐదు గ్యారంటీల హామీతో తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే తాజాగా ఐదు గ్యారంటీలపై కర్ణాటక మంత్రి సతీష్ జర్కీహోళీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసాయి. ఐదు గ్యారంటీలు అందరికి కాకుండా కేవలం అర్హులకి మాత్రమే అందజేయాలని, ఈ హామీలను ప్రభుత్వం మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ధనికులు కూడా ఈ పథకాలను పొందుతున్నారని, అలాంటి వారిని గ్యారంటీల నుండి మినహాయిస్తే రాష్ట్రానికి ప్రతి ఏడాది రూ.10 వేల కోట్లు ఆదా అవుతుందని పేర్కొన్నారు. అయితే మంత్రి వ్యాఖ్యలను విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారీతిన హామీలు ఇచ్చి, ఇపుడా భారం మోయలేక పోతుందని ఎద్దేవా చేశాయి. అలాగే ఆరు గ్యారంటీలు అర్హులకే కాకుండా ధనవంతులకు కూడా అందుతున్నాయని అధికార ప్రభుత్వం ఒప్పుకుందని, ప్రభుత్వ సొమ్మును అనర్హులకు కూడా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంది విపక్ష బీజేపీ. అయితే మంత్రి సతీష్ మాత్రం తన వ్యాఖ్యలను వక్రీకరించారని, గ్యారంటీలను నిలిపి వేయమని నేను అనలేదని, అవి అర్హులకు చేరితే మంచిదని మాత్రమే అన్నానని చెప్పుకొచ్చారు.