Kolkata rape-murder Case: ఖాళీ అవుతున్న కోల్‌కతా హాస్పిటల్‌ క్యాంపస్‌

కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ క్యాంపస్ ఖాళీ అవుతోంది. హత్యాచార ఘటన తర్వాత చాలా మంది భయంతో క్యాంపస్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Update: 2024-08-23 08:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ క్యాంపస్ ఖాళీ అవుతోంది. ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ హత్యాచారం తర్వాత చాలా మంది భయంతో క్యాంపస్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. నర్సింగ్ హాస్టల్ మినహా మెడికల్ కాలేజీలోని దాదాపు అన్ని హాస్టళ్లు ఖాళీగానే దర్శనమిస్తున్నాయని జూనియర్ డాక్టర్లు తెలిపారు. హత్యాచారం జరగడానికి ముందు క్యాంపస్‌లో దాదాపు 160 మంది మహిళా జూనియర్ డాక్టర్లు ఉండేవారు. కానీ, ప్రస్తుతం 17 మంది మాత్రమే ఉన్నారు.

భయాందోళనలో ట్రైనీ డాక్టర్లు

ట్రైనీ డాక్టర్ హత్యాచారం తర్వాత ఆగస్టు 14న అర్ధరాత్రి ఆసుపత్రిపై దుండగులు దాడి చేశారు. ఆ భయంతో ఎక్కువమంది విద్యార్థులు ముఖ్యంగా మహిళలను హాస్టల్ వీడి వెళ్లిపోయారని స్టూడెంట్స్ తెలిపారు. ఇప్పటికీ క్యాంపస్‌లో ఉన్న పలువురు నర్సులు.. తాము భయపడుతున్నామని వెల్లడించారు. వేరే ప్రాంతానికి వెళ్లేందుకు తమకు ఎటువంటి అవకాశం లేదని చెప్పారు. గతంలో క్యాంపస్ లో ఉన్న రెండు కాలేజీ హాస్టల్స్ నిండిపోగా.. ప్రస్తుతం అవన్నీ ఖాళీగా కన్పిస్తున్నాయి. “ఇలాంటి భయానక సంఘటనల తర్వాత కూడా మేం నైట్ డ్యూటీలు చేస్తున్నాము. కొన్నిసార్లు వార్డుల్లో ఒంటరిగా ఉంటున్నాం. నిజంగా చాలా భయంగా అసురక్షితంగా అన్పిస్తుంది” అని మరో నర్సు చెప్పింది. ఇకపోతే, సీనియర్ న్యాయవాది అపరాజితా సింగ్ ప్రకారం.. దాదాపు 700 మంది రెసిడెంట్ డాక్టర్లలో కేవలం 30-40 మంది మహిళా వైద్యులు, 60-70 మంది డాక్టర్లు క్యాంపస్ లో ఉన్నారని తెలిపారు.


Similar News