Priyanka Gandhi : అగ్నివీరులు నాలుగేళ్ల తర్వాత నిరుద్యోగులు కావాలా ?.. కేంద్రానికి ప్రియాంక ప్రశ్నాస్త్రాలు

దిశ, నేషనల్ బ్యూరో : యువత, సైనికులు, రైతులు, మహిళలు, క్రీడాకారులను కేంద్ర సర్కారు దగా చేసిందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ విమర్శించారు.

Update: 2024-10-02 17:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో : యువత, సైనికులు, రైతులు, మహిళలు, క్రీడాకారులను కేంద్ర సర్కారు దగా చేసిందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ విమర్శించారు. ప్రభుత్వం చేసిన మోసాలను గుర్తుంచుకొని హర్యానా ప్రజలు ఓట్లు వేయాలని ఆమె కోరారు. బుధవారం హర్యానాలోని భివానీలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రియాంక మాట్లాడారు. ‘‘అగ్నివీర్ స్కీంను మోడీజీ తీసుకొచ్చారు. దీని ప్రకారం.. అగ్నివీర్‌లుగా ఎంపికై దేశం కోసం ప్రాణాలిచ్చే వారి తల్లిదండ్రులకు పెన్షన్ ఇవ్వరట. కనీసం ఆ అగ్నివీర్ యోధులను ‘అమరులు’గా గుర్తించరట. నాలుగేళ్ల పాటు అగ్నివీరులుగా సేవలందించిన తర్వాత నిరుద్యోగులుగా మిగిలి పోవాలట. నిజాయితీగా దేశం కోసం పనిచేస్తే దక్కే బహుమతి ఇదేనా ?’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు.

‘‘హర్యానాలోని కురుక్షేత్ర మహాభారత భూమి. అసత్యంపై సత్యం, చెడుపై మంచి గెలిచి తీరుతాయని మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారమే హర్యానా ప్రజలు ఎన్నికల తీర్పు ఇవ్వబోతున్నారు’’ అని ప్రియాంక పేర్కొన్నారు. భారీ మెజారిటీతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘రెండుసార్లు కేంద్రంలో బీజేపీకి ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే ఎయిర్‌పోర్టులు, పోర్టులను కొందరు పారిశ్రామికవేత్తలకు అప్పగించారు. అలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడమంటే దేశ ప్రజలను మోసగించడమే’’ అని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ఆరోపించారు. ‘‘హర్యానాలో 30 పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. అందుకే రాష్ట్రంలోని అర్హులైన యువతకు ఉద్యోగాలు రాలేదు. డ్రగ్ మాఫియాకు బీజేపీ ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది’’ అని ప్రియాంకాగాంధీ మండిపడ్డారు. 


Similar News