Pm modi: చొరబాటుదారులకు జేఎంఎం మద్దతు.. ప్రధాని నరేంద్ర మోడీ

జార్ఖండ్‌లో అధికారంలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు

Update: 2024-10-02 19:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌లో అధికారంలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు. జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం చొరబాటుదారులకు మద్దతిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఫలితంగా రాష్ట్రంలో హిందువులు, ఆదివాసీల జనాభా తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పరివర్తన్ యాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను జేఎంఎం ప్రమాదంలో పడేసిందన్నారు. చొరబాటు దారులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఇలాంటి శక్తులను తరిమి కొట్టడానికి సమయం ఆసన్నమైందని తెలిపారు.

జార్ఖండ్ వారసత్వాన్ని తుడిచిపెట్టాలనుకునే వ్యక్తులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఫైర్ అయ్యారు. బంగ్లాదేశ్ చొరబాటుదారుల సంఖ్య పెరుగుతోందని, రాష్ట్రంలోని గిరిజన వర్గాలను మైనారిటీలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్వాతంత్య్ర పోరాటంలో విశేష కృషి చేసిన గిరిజన సంఘాలకు కాంగ్రెస్ ఎన్నడూ ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. రాజవంశ ఆలోచనలు దేశానికి చాలా హాని కలిగించాయని తెలిపారు. గిరిజన వీరుల గౌరవాన్ని బీజేపీ పునరుద్ధరించిందని, బిర్సా ముండా జన్మదినాన్ని ‘జం జాతీయ గౌరవ్ దివస్’గా ప్రకటించడంతో పాటు వారి సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుందని గుర్తు చేశారు.  


Similar News