భారత రాజ్యాంగంపై బీజేపీ బుల్డోజర్
భారత రాజ్యాంగంపై బీజేపీ ప్రభుత్వం బల్డోజర్ ను ప్రయోగిస్తుందని, పలుమార్లు సవరణలు చేస్తూ దళితులు, గిరిజనుల హక్కులను కాలరాస్తుందని రాజ్యసభ మాజీ సభ్యురాలు బృందాకారత్ మండిపడ్డారు.
దిశ, ఆదిలాబాద్ : భారత రాజ్యాంగంపై బీజేపీ ప్రభుత్వం బల్డోజర్ ను ప్రయోగిస్తుందని, పలుమార్లు సవరణలు చేస్తూ దళితులు, గిరిజనుల హక్కులను కాలరాస్తుందని రాజ్యసభ మాజీ సభ్యురాలు బృందాకారత్ మండిపడ్డారు. ఇది బీజేపీ ప్రభుత్వం కాదని ఆర్ఎస్ఎస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. 1950 నుంచి ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని ఎప్పుడూ స్వీకరించలేదని, దేశంలో మనుస్మృతిని అమలు చేయాలని కోరుకుంటుందని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం రెండు తుఫాకీ గొట్టాలతో పాలిస్తుందని, ఇందులో ఒకదానికి కార్మికులు, రైతులకు వ్యతిరేకంగా వినియోగిస్తుండగా మరో గొట్టంతో దేశంలో వివిధ వర్గాల మధ్య ఐక్యతను దెబ్బతీయటానికి ఉపయోగిస్తుందని ఆరోపించారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన ఆమె నూతనంగా నిర్మించిన బాశెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రం ( సీఐటీయూ జిల్లా కార్యాలయం)ను ప్రారంభించారు. అనంతరం ఆర్అండ్ అతిథి గృహం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. దేశంలో ఆర్ఎస్ఎస్ విధానాలతో బీజేపీ ముందుకు సాగుతుందని, ప్రతి ప్రసంగంలో మైనార్టీలను లక్ష్యంగా చేస్తుందని ధ్వజమెత్తారు.
బ్రిటీషు వారు ఏ విధంగా విభజించి పాలించే సూత్రాన్ని అవలంబించారో, విభజించి పాలించే సూత్రాన్ని పాటించారో అలాగే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేండ్ల నుంచి అనుసరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో రాజ్యాంగం గురించి గొప్పలు చెప్పిన ప్రధాని మోదీ దానికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగంలో నిమ్నజాతులకు హక్కులు కల్పించిందని, కానీ వీటిని వ్యతిరేకిస్తూ మనుస్మృతిని అమలు చేసేందుకు పూనుకుంటుందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం 5వ షెడ్యూల్ ను తొలగించి, దేశంలోని అటవీ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు. పార్లమెంటులో పోరాటం కారణంగా అటవీ హక్కు చట్టాన్ని సాధించామని, కానీ ఈ ప్రభుత్వం పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులపై కేసులు నమోదు చేస్తుందని మండిపడ్డారు. ఇక్కడ బీజేపీ ఆదివాసీ ఎంపీ ఉన్నప్పటికీ పార్లమెంటులో చేసిన ఆదివాసీ వ్యతిరేకచట్టాలకు అనుకూలంగా చేతులెత్తారని విమర్శించారు. ఆదివాసులు కార్మికులు, కర్షకులు కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం సాగించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.
కేంద్రం ధనికులకు రుణాలు మాఫీ చేయడంతో పాటు పన్నులను కూడా రద్దు చేశారని, పేదల సంక్షేమాన్ని మాత్రం విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు కనీస వేతనం, సమాన హక్కుల కోసం పోరాడుతున్నా పెడచెవిన పెడుతోందని మండిపడ్డారు. కార్మికుల పోరాట ఫలితంగా సాధించిన చట్టాలను కేంద్రం నాలుగు కోడ్లుగా విభజించి హక్కులను కాలరాస్తుందని ధ్వజమెత్తారు. కార్మికులు ఉద్యోగ క్రమబద్ధీకరణ కోసం పోరాడాలని, అందరూ ఏకతాటిపై వచ్చి పోరాడితే ఏదైనా సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన మన్యం వీరుడు కుమురంభీం పోరాటం, రాంజీగోండ్ చేసిన త్యాగాలను ఆమె స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి బి.చంద్రకుమార్, సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, మాజీ ఎంపీ మిడియం బాబురావు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జయలక్ష్మి, టీఏజీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనాల మల్లేష్, జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, కోశాధికారి కె.సునీత, వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంక రాఘవులు, రైతు సంఘం అధ్యక్షుడు బండి దత్తాత్రి పాల్గొన్నారు.