'ఆయన బీజేపీతో టచ్‌లో ఉన్నారు'.. బీహార్ సీఎం సంచలన ఆరోపణలు

మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీపై బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2023-06-16 11:53 GMT

పాట్నా : మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీపై బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీకి ప్రయోజనం చేకూర్చే దురుద్దేశంతో బీహార్‌లోని "మహా ఘట్బంధన్" ప్రభుత్వంలో ఉన్న మిత్రపక్షాలపై హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) పార్టీ వ్యవస్థాపకుడు జితన్ రామ్ ఇన్నాళ్లుగా గూఢచర్యం చేస్తున్నారని పేర్కొన్నారు. "మాంఝీకి జేడీయూ చాలా ఇచ్చింది. రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చాం. ఇన్ని చేసినా ఆయన బీజేపీతో టచ్‌లో ఉన్నారు. ఆయన ఇటీవల పలువురు బీజేపీ నేతలను కలిశాడు. జూన్ 23న జరగనున్న విపక్షాల సమావేశం విషయాలను జితన్ రామ్ బీజేపీకి లీక్ చేస్తాడనే భయం నాకుంది. అందుకే ఆయన పార్టీని జేడీయూలో విలీనం చేయాలని కోరాను. ఆయన కుదరదు అనడంతో మహా ఘట్బంధన్ కూటమి నుంచి వైదొలగాలని చెప్పాను. ఆయన వెళ్లిపోవడం మంచిదైంది" అని నితీష్ కుమార్ కామెంట్ చేశారు.

"జేడీయూలో విలీనం కావాలనే ఒత్తిడి కారణంగా తన పార్టీ హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్)కి ముప్పు ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది" అంటూ ఈనెల 13న మాంఝీ కుమారుడు సంతోష్‌ కుమార్‌ సుమన్‌ మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్‌లో కేబినెట్‌ విస్తరణలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సీఎం నితీష్‌కుమార్‌ సన్నిహితుడు సంతోష్‌ కుమార్‌ సుమన్‌ స్థానంలో జేడీయూ ఎమ్మెల్యే రత్నేష్‌ సదా శుక్రవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.


Similar News