ప్రజ్వల్‌ పరారీకి మేం క్లియరెన్స్ ఇవ్వలేదు : విదేశాంగ శాఖ

దిశ, నేషనల్ బ్యూరో : ఇంటి పని మనిషిపై లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్నతో పాటు హెచ్‌డీ రేవణ్ణ పేరు కూడా ఉంది.

Update: 2024-05-02 14:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఇంటి పని మనిషిపై లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్నతో పాటు హెచ్‌డీ రేవణ్ణ పేరు కూడా ఉంది. ప్రజ్వల్ రేవణ్ణ తండ్రే ఈ హెచ్‌డీ రేవణ్ణ. లైంగిక వేధింపుల వీడియోలు లీకైన వెంటనే ప్రజ్వల్ జర్మనీకి పరారయ్యాడు. ఇక బెంగళూరులోనే ఉన్న హెచ్‌డీ రేవణ్ణ ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నుంచి నోటీసును అందుకున్నాడు. ముందస్తు బెయిల్ కోసం గురువారం రోజు బెంగళూరులోని సెషన్స్ కోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. హెచ్‌డీ రేవణ్ణ మాట్లాడుతూ..‘‘సిట్ నాకు నోటీసులిచ్చిన మాట వాస్తవమే. దేన్నైనా ఎదుర్కొనేందుకు నేను సిద్ధం. సిట్‌ను కూడా ఎదుర్కొంటాను’’ అని తెలిపారు. భార్య ఇంట్లో లేని టైంలో హెచ్‌డీ రేవణ్ణ తనను లైంగికంగా వేధించే వాడని ఆ ఇంట్లో గతంలో పనిచేసిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణ భారత్‌లోకి ప్రవేశించగానే అదుపులోకి తీసుకునేందుకు అనుగుణంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం లుకౌట్ నోటీసు జారీ చేసింది.

కోర్టు ఆదేశాలొస్తే ఆ పాస్‌పోర్టు రద్దు

ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచి పారిపోవడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. ప్రజ్వల్ బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి జర్మనీకి వెళ్లిపోయే క్రమంలో తమ నుంచి పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. డిప్లొమాటిక్ పాస్‌పోర్టును వాడుకొని ఆయన నేరుగా జర్మనీకి వెళ్లారని వెల్లడించింది. వాస్తవానికి పొలిటికల్ క్లియరెన్స్ అనే అంశమేదీ తమ పరిధిలో ఉండదని విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. పార్లమెంటు సభ్యులందరికీ డిప్లొమాటిక్ పాస్‌పోర్టు ఉంటుందని పేర్కొంది. ఈ తరహా పాస్‌పోర్టును రద్దు చేసే అధికారం తమకు ఉందని, అయితే కోర్టు నుంచి ఆదేశాలు అందితేనే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని విదేశాంగ శాఖ తెలిపింది.

Tags:    

Similar News