Rajnath Singh: పాక్ ఆక్రమిత కశ్మీరే అసలైన జమ్ముకశ్మీర్- రాజ్ నాథ్ సింగ్
పాక్ ఆక్రమిత కశ్మీరే అసలైన జమ్ముకశ్మీర్ అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: పాక్ ఆక్రమిత కశ్మీరే అసలైన జమ్ముకశ్మీర్ అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) అన్నారు. అక్నూర్ సెక్టార్‌కు సమీపంలోని తాండా ఆర్టిలరీ బ్రిగేడ్ వద్ద 9వ సాయుధ దళాల వెటరన్స్ డే పాల్గొన్న ఆయన ఆర్మీ ప్రముఖులకు మకర సంక్రాంతి, నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు. పీఓకే గురించి మాట్లాడారు. పీఓకే లేకుండా జమ్ముకశ్మీర్ అసంపూర్ణమని అన్నారు. పొరుగుదేశం అక్కడ ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నడిపిస్తోందని ఆరోపించారు. పాకిస్థాన్‌కు పీవోకే విదేశీ భూభాగం అవుతుందే తప్ప మరొకటి కాదని అన్నారు. అందుకే, ఆ ప్రాంతంలో ఉగ్రవాద వ్యాపారాన్ని సాగిస్తోందని మండిపడ్డారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని చౌదరి అన్వర్ ఉల్ హఖ్ ఇటీవల భారత్‌పై చేసిన వ్యాఖ్యలను రాజ్‌నాథ్ తీవ్రంగా ఖండించారు.
కశ్మీర్ పై..
అక్నూర్ సెక్టార్‌లో పర్యటించడం ఈ ప్రాంతాన్ని, జమ్ముకశ్మీర్‌ను, ఢిల్లీని ఒకే విధమైన దృష్టితో చూస్తున్నామనే దానికి నిదర్శనమని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ‘కశ్మీర్ పై గత ప్రభుత్వాలు భిన్న వైఖరిని అనుసరించాయి. అందువల్లే ఇక్కడి ప్రజలు ఢిల్లీకి చేరువ కాలేకపోయారు. నేను గతాన్ని తవ్వాలనుకోవడం లేదు. కశ్మీర్‌కు, దేశంలోని మిగిలిన ప్రాంతాలకు ఓ వారధి నిర్మించడం మా ఎన్డీయే ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయం’ అని చెప్పారు. జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాను ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ ప్రజలకు, ఢిల్లీకి మధ్య దూరాన్ని చెరిపివేసేలా ఆయన పని చేస్తున్నారని కితాబిచ్చారు.