'ముక్కలుగా నరికేస్తాం'
2022లో శివసేనలో చీలిక తీసుకొచ్చి సీఎం కుర్చీలో కూర్చున్న విషయాలను కామ్రా తన పేరడీ పాటలో ప్రస్తావించారు.

- కునాల్ కమ్రాకు బెదిరింపు కాల్స్
- శివసేన(శిండే) కార్యకర్తల నుంచి ముప్పు ఉందన్న కమ్రా సన్నిహితులు
- పోలీసుల ముందు హాజరుకు సమయం కోరిన కామ్రా
- మరో పాట వదిలిన కునాల్
దిశ, నేషనల్ బ్యూరో: కమేడియన్ కునాల్ కామ్రాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండేపై ఒక కామెడీ షోలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై శివసేన నాయకులు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కునాల్ కామ్రాకు నోటీసులు పంపారు. అయితే పోలీసుల మందు హాజరు కావడానికి తనుకు మరి కొంత సమయం కావాలని కామ్రా కోరినట్లు తెలిసింది. ఇదే సమయంలో కామ్రాను చంపుతామని, ముక్కలుగా నరికేస్తామంటూ శివసేన శిండే పార్టీ నుంచి హత్యా బెదిరింపులు వచ్చినట్లు సన్నిహితులు తెలిపారు. కనీసం 500 కాల్స్ కామ్రాకు వచ్చాయని వారు పేర్కొన్నారు. ముంబైలోని ఖార్ ప్రాంతంలో ఉన్న హాబిటాట్ కామెడీ క్లబ్‌లో కొంత కాలం క్రితం కామ్రా ఒక షో చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రెండు రోజుల క్రితం యూట్యూబ్‌లో విడుదల చేశారు. అయితే ఈ షోలో.. 1997 బ్లాక్ బస్టర్ బాలీవుడ్ మూవీ 'దిల్ తో పాగల్ హై'లోని 'భోలిసి సూరత్' పాటకు పేరడీ వెర్షన్‌ను కామ్రా పాడారు. ఈ పాటలో ఏక్‌నాథ్ శిండే పేరును ప్రస్తావించకుండానే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో 'గద్దార్' (దేశద్రోహి) అంటూ శిండేను సంభోదించారంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2022లో శివసేనలో చీలిక తీసుకొచ్చి సీఎం కుర్చీలో కూర్చున్న విషయాలను కామ్రా తన పేరడీ పాటలో ప్రస్తావించారు. అప్పటి నుంచి శివసేన కార్యకర్తలు కునాల్ కామ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ షో చిత్రీకరించిన హాబిటాట్ క్లబ్‌పై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ కేసులో 12 మంది శివసేన కార్యకర్తలను అరెస్టు చేయగా.. తర్వాత వాళ్లు బెయిల్‌పై విడుదలయ్యారు. ఇక శివసేన పార్టీ ఎమ్మెల్యే ముర్జీ పటేల్ కూడా కామ్రాపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని కామ్రాకు నోటీసులు జారీ చేశారు. అయితే వ్యక్తిగతంగా హాజరు కావడానికి తనరకు వారం రోజుల సమయం కావాలని కోరాడు. ఆ మేరకు పోలీసులు కూడా కొంత సమయం కామ్రాకు ఇచ్చారు.
తాజాగా కునాల్ కామ్రా మరో వీడియోను విడుదల చేశారు. హాబిటాట్ క్లబ్‌ను శివసేన కార్యకర్తలు ధ్వంసం చేసిన వీడియోక్లిప్పింగ్స్‌కు 'హమ్ హోంగే కంగాల్' అనే పేరడీ పాటను జతచేసి మరోసారి యూట్యూబ్‌లో విడుదల చేశాడు. స్టుడియోను ధ్వంసం చేసిన శివసేన యువసేన ప్రధాన కార్యదర్శి రాహుల్ కనాల్ క్లిప్‌ను కూడా ఈ వీడియోలో కామ్రా ప్రదర్శించాడు.