పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్
కరుడుగట్టిన ఉగ్రవాది జైషే మహ్మద్ (JeM) చీఫ్ మసూద్ అజార్ పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని సమాచారం.
దిశ, నేషనల్ బ్యూరో: కరుడుగట్టిన ఉగ్రవాది జైషే మహ్మద్ (JeM) చీఫ్ మసూద్ అజార్ పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని సమాచారం. అక్కడ జరిగిన ఒక వివాహ వేడుకకు కూడా హాజరయ్యాడని ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. మసూద్ చనిపోయాడని, అనారోగ్యంతో మంచం పట్టడాని గతంలోనే పలు మార్లు నివేదికలు వచ్చినప్పటికి తాజాగా పాకిస్తాన్‌లో తిరుగుతున్నట్లు సమాచారం వచ్చింది. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో జైషే మహ్మద్ అనుబంధ గ్రూపుల ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జనవరి 1 నుండి వరుసగా జరుగుతున్న దాడుల్లో మసూద్ అజార్ హస్తం కూడా ఉన్నట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఐక్యరాజ్యసమితి (UN), అనేక ఇతర దేశాలచే గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తింపు పొందిన మసూద్ ఇటీవల బహవల్‌పూర్‌లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని ప్రసంగించాడు. ఏప్రిల్ 2019లో పెషావర్ సేఫ్ హౌస్ వద్ద పేలుడు నుండి తప్పించుకున్న తర్వాత అజార్ బహిరంగ సభలో కనిపించలేదు. తాజాగా జూన్ 27న, ఒక వివాహ వేడుకకు హాజరై, కాశ్మీర్, పాలస్తీనా జిహాద్‌లో తమ ప్రాణాలను త్యాగం చేసిన వారికి నివాళులర్పిస్తూ ప్రసంగం చేశాడు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కొన్ని జేఎమ్-లింక్డ్ ఛానెల్‌లు అప్‌లోడ్ చేశాయి. దీంతో అతను ఇంకా పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలిసింది.