Rajasthan: హైఅలర్ట్.. జైపూర్ లోని రెండు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు

రాజస్థాన్‌లోని రెండు ఆస్పత్రులకో బాంబు బెదిరింపులు వచ్చాయి. జైపూర్‌లోని సీకే బిర్లా, మోనిలెక్ ఆస్పత్రుల్లో బాంబు ఉన్నట్లు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి.

Update: 2024-08-18 07:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌లోని రెండు ఆస్పత్రులకో బాంబు బెదిరింపులు వచ్చాయి. జైపూర్‌లోని సీకే బిర్లా, మోనిలెక్ ఆస్పత్రుల్లో బాంబు ఉన్నట్లు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో, సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. సిటీ అంతా హై అలర్ట్ ప్రకటించారు. బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేపడుతోంది. రోగులను, వారి బంధువులను ఆస్పత్రి నుంచి బయటకు పంపించారు. సురక్షిత ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్‌గా మారింది. మరోవైపు, ఈమెయిల్ ఎక్కడ్నుంచి వచ్చిందనే దానిపై విచారణ సాగిస్తున్నారు. ఇకపోతే, హర్యానాలో గురుగ్రామ్‌ లోని ఆంబియెన్స్ మాల్‌కు బాంబు బెదిరింపు వచ్చిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం జరిగింది. గురుగ్రామ్ మాల్ మేనేజ్ మెంట్ కు ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. "భవనంలోని ప్రతి ఒక్కరినీ చంపడానికి బాంబులు అమర్చాం" అని ఆ సందేశంలో ఉంది.

నోయిడాలో మాక్ డ్రిల్

కాగా, నోయిడాలోని సెక్టార్ 18లోని డీఎల్‌ఎఫ్ మాల్‌లో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు మొత్తం మాల్‌ను ఖాళీ చేయించారు. అయితే, బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఆరోపణలు రాగా.. అవన్నీ ఫేక్ అని తేలింది. నోయిడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాంబదన్ సింగ్ మాల్ భద్రతను తనిఖీ చేయడానికి మాక్ డ్రిల్ నిర్వహించినట్లు ధ్రువీకరించారు. ఇటీవలి కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పలు ఆసుపత్రులకు బాంబు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. తనిఖీల అనంతరం అవి ఫేక్‌ అని తేలుతోంది. అయితే ఇలాంటి వదంతుల వలన సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.


Similar News