Jagadheep dhankad: జాతీయ విద్యా విధానం భేష్.. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్

నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)పై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-08 13:08 GMT

దిశ: నేషనల్ బ్యూరో: నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)పై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విధానం ఓ గేమ్ చేంజర్ లాంటిదని అభివర్ణించారు. దీనిని అవలంభించని రాష్ట్రాలు తమ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని సూచించారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వీలైనంత త్వరగా వంద శాతం అక్షరాస్యతను నిర్ధారించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అక్షరాస్యతను ఎక్కువగా కొనసాగిస్తే భారత్, నలంద, తక్షశిల వంటి అభ్యాసకేంద్రంగా తన ప్రాచీన హోదాను తిరిగి పొందగలదని నొక్కి చెప్పారు.

నూతన జాతీయ విద్యా విధానం యువతకు వారి ప్రతిభను, శక్తిని పూర్తిగా ఉపయోగించుకునేలా చేస్తుందని, అన్ని భాషలకు తగిన ప్రాముఖ్యతను ఇస్తుందని కొనియాడారు. ప్రపంచంలో భారత్ భిన్నమైన దేశమని, అనేక భాషలతో కూడిన గొప్ప సంస్కృతి మనకు ఉందని తెలిపారు. రాజ్యసభలో 22భాషల్లో మాట్లాడే అవకాశం సభ్యులకు కల్పిస్తున్నానని చెప్పారు. వారి బాడీ లాంగ్వేజ్ చూసి వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకుంటానన్నారు. కనీసం ఒకరినైనా అక్షరాస్యులుగా చేసేందుకు ప్రతి ఒక్కరూ సంకల్పించాలని పిలుపునిచ్చారు. 100 శాతం అక్షరాస్యత సాధ్యమైతే వికసిత్ భారత్ లక్ష్యానికి వెన్నెముకగా ఉంటుందన్నారు. 


Similar News