భారీగా నగదు సీజ్.. ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన

గత నాలుగు రోజులుగా తెలంగాణ, ఏపీ, కర్ణాటక, ఢిల్లీలోని 55 చోట్ల సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.

Update: 2023-10-16 12:47 GMT

న్యూఢిల్లీ : గత నాలుగు రోజులుగా తెలంగాణ, ఏపీ, కర్ణాటక, ఢిల్లీలోని 55 చోట్ల సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్‌ 12 నుంచి సోమవారం వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ.94 కోట్ల నగదుతో పాటు రూ.8 కోట్లు విలువ చేసే బంగారం, వజ్రాభరణాలు, 30 లగ్జరీ వాచ్‌లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. ఒక వ్యక్తి నివాసంలో జరిపిన సోదాలు 30 విదేశీ రిస్ట్‌ వాచ్‌‌లు లభ్యమయ్యాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పేర్కొంది.

ప్రధానంగా ప్రభుత్వ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, వారి సంబంధీకుల ఇళ్లలో ఐటీ సోదాలు జరిగాయని తెలిపింది. పన్ను ఎగవేత, బోగస్ బిల్లుల సమర్పణ, సబ్ కాంట్రాక్టర్లతో లాలూచీ పడటం, ఖాతా పుస్తకాల లెక్కల్లో మాయాజాలం, అక్రమాస్తులను కూడబెట్టడం వంటి ఆరోపణలు వచ్చిన కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లపై రైడ్స్ చేశామని ఐటీ శాఖ స్పష్టం చేసింది.


Similar News