శివ శక్తి పాయింట్ వద్ద ‘ప్రజ్ఞాన్’ చక్కర్లు.. కొత్త వీడియో రిలీజ్ చేసిన ఇస్రో

చంద్రయాన్-3 ప్రయోగంలో మరో కీలక అంకం ప్రారంభమైంది.

Update: 2023-08-26 16:39 GMT

బెంగళూరు : చంద్రయాన్-3 ప్రయోగంలో మరో కీలక అంకం ప్రారంభమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ అయిన ల్యాండర్ లో నుంచి చంద్రుడి ఉపరితలంపైకి వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ‘శివశక్తి పాయింట్’ పరిసరాల్లో ప్రజ్ఞాన్ సాగిస్తున్న రీసెర్చ్ జర్నీకి సంబంధించిన మరో వీడియోను ఇస్రో శనివారం ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. సెకనుకో సెంటీమీటర్ చొప్పున రోవర్ ముందుకు కదులుతుండటం అందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రోవర్ చక్రాల్లో భారత జాతీయ పతాక చిహ్నం, ఇస్రో లోగోల డిజైన్ ఉంది. అందుకే చంద్రుడిపై రోవర్ అడుగులు వేసిన చోటల్లా.. భారత త్రివర్ణ పతాకం, ఇస్రో లోగో అచ్చు అవుతుంది. చంద్రుడిపై వాతావరణం లేదు. అక్కడ ఇసుక తుఫానులు కూడా అస్సలు ఉండవు.

అందువల్ల మన రోవర్ ప్రజ్ఞాన్ బుడిబుడి అడుగులతో పడుతున్న అచ్చులు చిరకాలం పాటు అలాగే నిలిచిపోతాయి. వీటిని చూసి నెటిజన్లు చాలా ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నారు. అందుకే ఈ వీడియోను రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే భారీగా వ్యూస్ వచ్చాయి. ఇక చంద్రుడి ఉపరితలాన్ని, వాతావరణాన్ని, ప్రకంపనాలను, కెమికల్ కాంపొజిషన్ ను శాస్త్రీయంగా విశ్లేషించడమే లక్ష్యంగా ప్రజ్ఞాన్ రీసెర్చ్ ను కొనసాగించనుంది. ఇక సూర్యుడి రహస్యాలను తెలుసుకునేందుకు సెప్టెంబరు 2న ఆదిత్య-ఎల్‌ 1 ఉపగ్రహాన్ని ప్రయోగాన్ని నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటికే దీన్ని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)కు తీసుకొచ్చామన్నారు. పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక ద్వారా ఆదిత్య-ఎల్‌ 1ను కక్ష్యలోకి ప్రవేశపెడతామని వెల్లడించారు.

అక్టోబర్‌ లో గగన్‌యాన్‌ తొలి ట్రయల్‌ రన్‌..

ఈ ఏడాది అక్టోబర్‌ మొదటి లేదా రెండో వారంలో గగన్‌యాన్‌ తొలి ట్రయల్‌ రన్‌ ను ఇస్రో చేపట్టనుందని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా అంతరిక్షానికి మహిళా రోబో "వ్యోమమిత్ర"ను పంపనున్నట్లు చెప్పారు. ఈ రోబో..మనిషితో సమానంగా మాట్లాడుతుందని అంతా సక్రమంగా జరిగితే అంతిమంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతామన్నారు. వ్యోమగాములను పంపించడం ఎంత ముఖ్యమో, వారిని తిరిగి తీసుకురావడం కూడా అంతే ముఖ్యమని మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. 2024 ఆఖరు నాటికి ముగ్గురు వ్యోమగాములతో గగన్ యాన్ ప్రయోగాన్ని నిర్వహించాలని ఇస్రో పరిశోధనలు చేస్తోందని వివరించారు.


Similar News