Chandrayaan-4,5: చంద్రయాన్ ప్రయోగాలపై కీలక అప్‌డేట్
చంద్రయాన్-3 ముగిసిన నేపథ్యంలో తదుపరి అందరి చూపు చంద్రయాన్ 4, 5 మిషన్లపై పడింది.
దిశ, నేషనల్ బ్యూరో: చంద్రయాన్-3 ముగిసిన నేపథ్యంలో తదుపరి అందరి చూపు చంద్రయాన్ 4, 5 మిషన్లపై పడింది. తాజాగా వీటికి సంబంధించిన కీలక అప్‌డేట్‌లను ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. చంద్రయాన్ 4, 5 ప్రయోగాల డిజైన్‌ను అంతరిక్ష సంస్థ పూర్తి చేసిందని, దీనికి ప్రభుత్వ ఆమోదం పొందాల్సి ఉందని తెలిపారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇండియన్ స్పేస్ అసోసియేషన్ కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ, అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత చంద్రయాన్ తదుపరి మిషన్లను విజయవంతంగా నిర్వహిస్తాం. అలాగే, ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల అవసరాలను తీర్చడానికి తక్కువ భూకక్ష్య ఉపగ్రహాల సమూహంతో సహా రాబోయే ఐదేళ్లలో అంతరిక్ష సంస్థ 70 ఉపగ్రహాలను ప్రయోగించాలని యోచిస్తోందని సోమనాథ్ చెప్పారు.
వీటిలో నావిగేషన్, సమయ సేవలను అందించడానికి NAVIC ప్రాంతీయ నావిగేషన్ సిస్టమ్, ఇన్సాట్ 4D వాతావరణ ఉపగ్రహాలు, రిసోర్స్‌శాట్ సిరీస్ ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్, అధిక రిజల్యూషన్ ఇమేజింగ్ కోసం కార్టోశాట్ ఉపగ్రహాలు తదుపరి ప్రయోగంలో సిద్ధంగా ఉన్నాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి హై త్రూపుట్ శాటిలైట్‌లను, స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ రాకెట్‌లో ప్రయోగించేందుకు అమెరికాకు పంపేందుకు జీశాట్ ఉపగ్రహాన్ని కూడా ఇస్రో అభివృద్ధి చేస్తోందని ఆయన చెప్పారు. గగన్‌యాన్ ప్రాజెక్ట్ మొదటి మానవరహిత మిషన్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభిస్తామని సోమనాథ్ తెలిపారు.