కాశ్మీర్ లోయలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రారంభం
ప్రధాని మోడీ నేతృత్వంలో జూన్ 21న కాశ్మీర్ లోయలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ నేతృత్వంలో జూన్ 21న కాశ్మీర్ లోయలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ ప్రధాన వేడుకకు ముందుగా లోయలో పలు ముందస్తు కార్యక్రమాలను బుధవారం నుంచి ప్రారంభించారు. లాల్ చౌక్ సిటీ సెంటర్‌లోని ఐకానిక్ క్లాక్ టవర్ దగ్గర యోగా కార్యక్రమం నిర్వహించారు. అక్కడి యువత, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని యోగాసనాలు' ప్రదర్శించారు. లోయలో చాలా చోట్ల ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని అధికారులు తెలిపారు. ఇటీవల మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వచ్చినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కాశ్మీర్ లోయలో భారీగా యోగా కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
శుక్రవారం ఉదయం ఇక్కడి ప్రసిద్ధ దాల్ సరస్సు ఒడ్డున ఉన్న SKICCలో ప్రధాన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మోడీ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను కూడా కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. వేదిక చుట్టూ భద్రతా దళాలను మోహరించారు. SKICCకి వెళ్లే అన్ని రహదారులను మూసివేసినట్లుగా వారు తెలిపారు. ప్రధాని పర్యటనకు ముందు, జమ్మూకశ్మీర్ పోలీసులు మంగళవారం నగరాన్ని తాత్కాలిక "రెడ్ జోన్"గా ప్రకటించారు. అలాగే లోయలో డ్రోన్లపై నిషేధం విధించారు. ఇటీవల ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోడీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.