Sanjay Raut: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి- ఎంపీ సంజయ్ రౌత్
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి (Maharashtra CM) ఎవరనే దానిపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. ఈ నేపథ్యంలో శివసేన (యూటీబీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి (Maharashtra CM) ఎవరనే దానిపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. ఈ నేపథ్యంలో శివసేన (యూటీబీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) కీలక వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో మహాయుతి కూటమి విఫలమైందని విమర్శించారు. ఈ మేరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను(Presidents Rule In Maharashtra) అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి భారీ మెజారిటీ వచ్చింది. నవంబర్ 26వ తేదీతో శాసనసభ పదవీకాలం కూడా ముగిసింది. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతోంది. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి ఎవరో కూడా నిర్ణయం తీసుకోలేదు. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అనే పరిస్థితి వచ్చినప్పుడు 26వ తేదీలోగా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే రాష్ట్రపతి పాలన విధించాలి’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు
కాగా, ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ.. బీజేపీకి 132, శివసేనకు 57, ఎన్సీపీకి 41 స్థానాలు లభించాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి మార్గం సుగమం చేస్తూ ముఖ్యమంత్రి పదవికి ఏక్నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేశారు. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేవరకూ ఆపద్ధర్మంగా కొనసాగాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ షిండేను కోరారు.