సూడాన్‌లో టెన్షన్.. టెన్షన్.. ఆర్మీ, పారామిలిటరీ మధ్య ఘర్షణ
సూడాన్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఖర్తోమ్: సూడాన్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్మీకి పారామిలిటరీ మధ్య ఘర్షణ పూరిత వాతవరణం చోటుచేసుకుంది. సైన్యాధినేతకు అబ్దుల్ ఫతే అల్ బుర్హన్, పారామిలిటరీ కమాండర్ మహ్మద్ హమ్దాన్ డగ్లో మధ్య విభేధాలు తీవ్ర స్థాయికి చేరడంతో ఇరు వర్గాలు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో దేశంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆధిపత్య పోరులో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడినట్లు స్థానిక నివేదికలు పేర్కొన్నాయి. అయితే విమానాలతో దాడులకు పాల్పడిందనే ఆరోపణలను ఆర్మీ కొట్టిపారేసింది. ఇరు వర్గాల మధ్య కాల్పుల ఘటనల్లో ముగ్గురు పౌరులు మరణించగా, పలువురు గాయపడ్డారు.
మరోవైపు ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత ఎంబసీ సుడాన్‌లోని తమ దేశ పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. ఘర్షణల నేపథ్యంలో భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేస్తూ ట్వీట్ చేసింది. మరోవైపు ఈ ఘర్షణలకు ముగింపు పలకాలని యూఎస్, రష్యాలు కోరాయి. వెంటనే కాల్పులను విరమించుకోవాలని పిలుపునిచ్చాయి.