మెడికల్ గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఫారిన్‌లోనూ ప్రాక్టీస్‌కు ఛాన్స్

మనదేశ మెడికల్ స్టూడెంట్స్ ఇకపై ఫారిన్‌లోనూ ప్రాక్టీస్‌ చేయొచ్చని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Update: 2023-09-21 13:28 GMT

న్యూఢిల్లీ : మనదేశ మెడికల్ స్టూడెంట్స్ ఇకపై ఫారిన్‌లోనూ ప్రాక్టీస్‌ చేయొచ్చని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈమేరకు వరల్డ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డబ్ల్యూఎఫ్ఎంఈ) నుంచి జాతీయ వైద్యమండలి (ఎన్ఎంసీ)కి వచ్చే 10 ఏళ్ల కాలానికి గుర్తింపు లభించిందని తెలిపింది. దీంతో భారత్‌లో మెడికల్ ఎడ్యుకేషన్ చేసినవారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌లలో పీజీ కోర్సుల్లో చేరి, ప్రాక్టీస్‌ చేసేందుకు మార్గం సుగమమైందని పేర్కొంది. 2024 నుంచి భారత వైద్య విద్యార్థులు విదేశాల్లో వైద్య విద్య, ప్రాక్టీస్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.

ప్రస్తుతం దేశంలో ఉన్న వైద్యకళాశాలలు, రాబోయే పదేళ్లలో ఏర్పాటయ్యే మెడికల్ కాలేజీలు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు పొందుతాయని కేంద్రం తెలిపింది. ఈ గుర్తింపు ప్రక్రియ కోసం ప్రతి మెడికల్ కాలేజీ నుంచి రూ.50 లక్షల ఫీజును డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ వసూలు చేయనుంది. దీంతో దేశంలోని 706 వైద్య కళాశాలలు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు కోసం దాదాపు రూ.351 కోట్లు ఖర్చు చేయనున్నాయి.


Similar News