Adr report: హర్యానా ఎమ్మెల్యేల్లో 96 శాతం కోటీశ్వరులే.. ఏడీఆర్ నివేదికలో వెల్లడి

హర్యానాలో కొత్తగా ఎన్నికైన 90 మంది ఎమ్మెల్యేల్లో 86 మంది ఎమ్మెల్యేలు (96 శాతం) కోటీశ్వరులేనని ఏడీఆర్ నివేదికలో వెల్లడైంది.

Update: 2024-10-10 10:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలో కొత్తగా ఎన్నికైన 90 మంది ఎమ్మెల్యేల్లో 86 మంది ఎమ్మెల్యేలు (96 శాతం) కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదికలో వెల్లడైంది. 2019లో ఎన్నికైన శాసన సభ్యుల్లో 93 శాతం కోటీశ్వరులుండగా.. ఈసారి 96 శాతానికి పెరగడం గమనార్హం. 90 మంది ఎమ్మెల్యేల్లో 44 శాతం మంది 10 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కలిగి ఉండగా, 2.2 శాతం మంది మాత్రమే 20 లక్షల రూపాయల లోపు ఆస్తులు కలిగి ఉన్నారని పేర్కొంది. పార్టీల వారీగా చూస్తే.. 96 శాతం బీజేపీ ఎమ్మెల్యేలు, 95 శాతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 100 శాతం ఐఎన్‌ఎల్‌డీ, ఇండిపెండెంట్‌లలో 100 శాతం మంది కోటి రూపాయలకు మించి ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు.

హిసార్‌కు చెందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సావిత్రి జిందాల్ మొత్తం రూ. 270 కోట్ల ఆస్తులతో అగ్రస్థానంలో ఉండగా, బీజేపీకి చెందిన శక్తి రాణి శర్మ రూ. 145 కోట్లు, శృతి చౌదరి రూ. 134 కోట్లతో తదురి స్థానాల్లో ఉన్నారు. 2024లో మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు తిరిగి ఎన్నికవ్వగా 2019 నుంచి వారి సగటు ఆస్తులు 59 శాతం పెరిగాయి. ఇక, 68 శాతం మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్లు లేదా ఉన్నత డిగ్రీలు కలిగి ఉండగా.. 29 శాతం మంది 8వ తరగతి నుండి 12వ తరగతి వరకు మాత్రమే అర్హత కలిగి ఉన్నారు. అలాగే 13శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే.


Similar News