బాల్టిమోర్‌లో వంతెనను ఢీకొన్న ఓడలో 22 మందీ భారతీయులే
మంగళవారం తెల్లవారుఝామున 1.30 గంటల ప్రాంతంలో బాల్టిమోర్‌లోని ఫ్రావిన్స్ స్కాట్‌కీ వంతెనను కార్గొ షిప్ ఢీకొని కూలిపోయింది
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని బాల్టిమోర్‌లో ఫ్రాన్సిస్ స్కాట్‌కీ వంతెనను ఢీకొన్న వాణిజ్య నౌకలో ఉన్న 22 మంది సిబ్బంది భారతీయులేనని చార్టర్ మేనేజ్‌మెంట్ సంస్థ వెల్లడించింది. వారంతా సురక్షితమేనని పేర్కొంది. మంగళవారం తెల్లవారుఝామున 1.30 గంటల ప్రాంతంలో బాల్టిమోర్‌లోని ఫ్రావిన్స్ స్కాట్‌కీ వంతెనను కార్గొ షిప్ ఢీకొట్టి అక్కడే కూలిపోయింది. అదే సమయంలో వంతెనపై సుమారు ఏడుగురు నిర్మాణ కార్మికులు, మూడు నాలుగు వాహనాలు ఉన్నాయి. షిప్ ఢీకొట్టడంతో వారంతా నీళ్లలో పడిపోయారు. ఇప్పటివరకు, ఇద్దరిని రక్షించగా, మరో ఆరుగురు ఆచూకీ లేకుండా పోయారు. రక్షించిన వారిలో ఒకరు క్షేమంగా ఉన్నారు, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని సిటీ ఫైర్ డిపార్ట్‌మెంట్ చీఫ్ జేమ్స్ వాలెస్ వివరించారు. నదిలో ఎంతమంది పడిపోయారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. ప్రమాదానికి గురైన ఓడ బాల్టిమోర్ నుంచి కొలంబోకు వెళ్తోందని అధికారులు తెలిపారు. ఈ వ్యవహరంపై స్పందించిన షిప్ మేనేజ్‌మెంట్ కంపెనీ సినర్జీ మెరైన్ గ్రూప్, ఘటనకు కారణాలు ఇంకా కనుగొనలేదు. ప్రమాదంతో తాము ఆందోళణకు గురయ్యామని పేర్కొంది. వంతెన కూలిపోయిన ఘటన గురించిన తెలుసుకున్న మేరీల్యానండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ ప్రమాద తీవ్రతను గుర్తించి వంతెనపై ట్రాఫిక్‌ను మూసేసింది.