Open AI: ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి సుచిర్ బాలజీ మృతిపై అనుమానాలు
ఓపెన్ ఏఐ (Open AI) మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ(Techie Suchir Balaji Death) మృతి కేసుపై ఆయన తల్లి పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఓపెన్ ఏఐ (Open AI) మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ(Techie Suchir Balaji Death) మృతి కేసుపై ఆయన తల్లి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తాము ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ను నియమించుకుని రెండోసారి శవపరీక్ష చేశామని పేర్కొన్నారు. అయితే, పోలీసులు చెప్పిన దానికి ఆ రిజల్ట్స్ ఉన్నాయని అన్నారు. ‘‘సుచిర్ అపార్ట్‌మెంట్ లో చోరీ జరుగుతున్నట్లు కన్పిస్తోంది. బాత్రూంలో ఘర్షణ జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. రక్తపు మరకలు కన్పించాయి. ఎవరో అతడ్ని కొట్టి ఉంటారని అనిపిస్తోంది. ఈ ఘోరమైన హత్యను అధికారులు ఆత్మహత్యగా తేల్చిచెప్పారు. మాకు న్యాయం జరగాలి. దీనిపై ఎఫ్‌బీఐతో దర్యాప్తు జరిపించాలి’’ అని పూర్ణిమ కోరారు. ఈ పోస్ట్‌ను ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి, భారత విదేశాంగ శాఖకు ట్యాగ్ చేశారు.
స్పందించిన మస్క్
అయితే, సుచిర్ బాలజీ తల్లి పోస్టుపై బిలియనీర్ ఎలాన్ మస్క్ స్పందించారు.‘అది ఆత్మహత్యలా అనిపించడం లేదు’ అని ఆయన మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. ఇకపోతే, చాట్‌జీపీటీని రూపొందించిన సంస్థ ఓపెన్‌ఏఐ (Open AI), దాని సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ (Sam Altman)పై టెస్లా అధినేత ఎలాన్‌మస్క్ (Elon Musk)తో చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. 2015లో ఓపెన్‌ఏఐను శామ్ ఆల్టమన్ బృందం స్థాపించినప్పుడు మస్క్ అందులో పెట్టుబడులు పెట్టారు. విభేదాల వల్ల 2018లో సంస్థ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. చాట్‌జీపీటీ మాతృ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ సమాజానికి హాని కలిగిస్తోందని గతంలో విమర్శలు చేసిన విజిల్ బ్లోయర్ 26 ఏళ్ల సుచిర్ బాలాజీ (Techie Suchir Balaji Death) హఠాత్తుగా మరణించాడు. దీంతో, ఆయన మృతిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత సంతతికి చెందిన సుచిర్ బాలాజీ.. నాలుగేళ్ల పాటు ‘ఓపెన్ ఏఐ (Open AI)’లో పరిశోధకుడిగా పనిచేశారు. ఈ ఏడాది ఆగస్టులో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. చాట్‌జీపీటీ (ChatGPT) అభివృద్ధి సమయంలో సంస్థ కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే మృతిచెందడం కలకలం రేపుతోంది.