Yunus Modi Meeting :షేక్ హసీనా అప్పగింతపై తాడోపేడో.. ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోరిన బంగ్లాదేశ్

దిశ, నేషనల్ బ్యూరో : షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించిన అంశాన్ని బంగ్లాదేశ్ సీరియస్‌గా పరిగణిస్తోంది.

Update: 2024-09-07 13:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో : షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించిన అంశాన్ని బంగ్లాదేశ్ సీరియస్‌గా పరిగణిస్తోంది. భారత్‌లో ఉంటూ షేక్ హసీనా చేస్తున్న వ్యాఖ్యల వల్ల తమ దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వాధినేత మహ్మద్ యూనుస్ ఇటీవలే అసహనం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో నేరుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎదుట షేక్ హసీనా అప్పగింత అంశాన్ని లేవనెత్తాలని యూనుస్ భావిస్తున్నారు. ఈనెలాఖరులో అమెరికాలోని న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జరగబోతోంది. దానిలో పాల్గొనేందుకు భారత ప్రధాని మోడీ వెళ్లనున్నారు.

ఆసందర్భంగా మోడీతో సమావేశమయ్యేందుకు భారత విదేశాంగ శాఖను బంగ్లాదేశ్ సర్కారు అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై భారత్ వైపు నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని సమాచారం. కాగా, ఐరాస సర్వసభ్య సమావేశంలో భాగంగా ఈనెల 26న జరగనున్న అత్యున్నత స్థాయి చర్చలో ప్రధాని మోడీ ప్రసంగించడం లేదని సమాచారం. ఆయనకు బదులుగా భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడనున్నారు. ఇక సెప్టెంబరు 22న న్యూయార్క్‌‌లోని లాంగ్ ఐలాండ్‌లో ఉన్న నసాయు వెటరన్స్ మెమోరియల్ కొలీజియంలో జరగనున్న ప్రవాస భారతీయులు, వ్యాపారవేత్తల సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారని తెలుస్తోంది. దీనికి దాదాపు 16వేల మంది హాజరవుతారని అంచనా.


Similar News