ఎల్‌వోసీని దాటేందుకు భారత్ సిద్ధం : Rajnath Singh

"దేశ గౌరవ ప్రతిష్ఠలను కాపాడుకోవడానికి ఎక్కడి వరకైనా వెళ్తాం.

Update: 2023-07-26 17:11 GMT

న్యూఢిల్లీ : "దేశ గౌరవ ప్రతిష్ఠలను కాపాడుకోవడానికి ఎక్కడి వరకైనా వెళ్తాం. కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖను దాటడానికైనా రెడీ. ప్రజలు కూడా సైన్యానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి" అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా లడఖ్‌లోని ద్రాస్‌ సెక్టార్‌లో ఉన్న కార్గిల్‌ యుద్ధ స్మారకం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మనకు గతంలో పాకిస్థాన్‌ వెన్నుపోటు పొడిచింది. అందుకే అప్పుడు కార్గిల్ యుద్ధం చేయాల్సి వచ్చింది. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సైనికులకు వందనం చేస్తున్నా.

దేశం యుద్ధాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిన ప్రతిసారి ప్రజలు పరోక్షంగా మద్దతుగా నిలిచారు. యుద్ధ రంగంలో అవసరమైన చోట సైనికులకు నేరుగా మద్దతు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని నేను కోరుతున్నాను. దేశ గౌరవ ప్రతిష్ఠల కోసం నియంత్రణ రేఖనూ దాటతాం. అందుకు మేము సిద్ధంగా ఉన్నాం’’ అని వెల్లడించారు. కేవలం కార్గిల్‌ యుద్ధంలోనే కాకుండా.. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఎన్నోసార్లు సైన్యం తమ ధైర్య సాహసాలతో దేశం గర్వించేట్లు చేసిందన్నారు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా కార్గిల్‌ అమరవీరులకు నివాళులర్పించారు.


Similar News