IMD: సెప్టెంబర్ లో ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు: ఐఎండీ
సెప్టెంబర్ నెలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా సగటు కంటే 16 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు అయిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర శనివారం వెల్లడించారు. ఈ నెలలో నార్త్ వెస్ట్ రీజియన్ లో 253.9 మి.మీ వర్షపాతం నమోదు అయిందని ఇది 2001 నుంచి ఆగస్టు నెలలో రెండవ అత్యధిక వర్షపాతం అని పేర్కొన్నారు. జూన్ 1న రుతుపవనాల సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో 749 మి.మీ వర్షపాతం నమోదైందని చెప్పారు. ఈ సమయంలో ఉండే 701 మి.మీ సాధారణ వర్షపాతం ఈ ఏడాది అధిగమించిందన్నారు. మరోవైపు హిమాలయాలు, ఈశాన్య ప్రాంతాల దిగువన ఉన్న అనేక జిల్లాలు సాధారణం కంటే తక్కువ వర్ష పాతం చవిచూశాని తెలిపారు.
సెప్టెంబర్ లో అతి భారీ వర్షాలు: సెప్టెంబర్ లో దేశంలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్ముకశ్మీర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పరిసర ప్రాంతాలు సహా వాయువ్య భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాలు భారీ వరదల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. దీర్ఘకాల సగటు వర్షపాతం 167.మి.మీలో 109 శాతంగా ఉంటుందని తెలిపారు.