Canada : కెనడాలో మా దౌత్యవేత్తలకు ముప్పు పెరిగింది : భారత్
దిశ, నేషనల్ బ్యూరో : కెనడా(Canada)లో నిర్వహించాల్సిన కాన్సులర్ క్యాంపులను భారత్(India) రద్దు చేసుకున్న వ్యవహారంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్(Randhir Jaiswal) కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : కెనడా(Canada)లో నిర్వహించాల్సిన కాన్సులర్ క్యాంపులను భారత్(India) రద్దు చేసుకున్న వ్యవహారంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్(Randhir Jaiswal) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కెనడాలోని భారత దౌత్యవేత్తలకు ముప్పు పెరిగిందని ఆయన తెలిపారు. ‘‘కాన్సులర్ క్యాంపులలో పాల్గొనే భారత దౌత్యవేత్తలకు భద్రత కల్పించమని కెనడా ప్రభుత్వాన్ని కోరాం. అయితే అందుకు తగిన స్పందన రాలేదు. దీంతో మేం కాన్సులర్ క్యాంపులను రద్దు చేసుకున్నాం’’ అని రణధీర్ వెల్లడించారు.
‘‘గత ఏడాదిన్నర వ్యవధిలో కెనడాలో ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత దౌత్యవేత్తలకు బెదిరింపులు వచ్చాయి. వారిని వేధించారు’’ అని ఆయన తెలిపారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈవివరాలను రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ‘‘కెనడాలోని భారత దౌత్యవేత్తలకు ముప్పు పెరిగిన మాట నిజమే. నిత్యం వారిపై నిఘా పెడుతున్నారు. దాన్ని మేం అంగీకరించం. ఈవిషయాన్ని కెనడాకు స్పష్టంగా తెలియజేశాం’’ అని ఆయన చెప్పారు. ‘‘బ్రాంప్టన్‌లో హిందూ ఆలయం వద్ద జరిగిన ఘటనను మేం ఖండిస్తున్నాం. కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం సమన్యాయ పాలన చేయాలి. హింసకు దిగుతున్న వారిని శిక్షించాలి’’ అని రణధీర్ డిమాండ్ చేశారు.