Trump : ట్రంప్ క్యాబినెట్‌లోకి భారత సంతతి నేతలు.. ఎవరెవరు అంటే..

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Trump) జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Update: 2024-11-07 13:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Trump) జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకోసం దాదాపు రెండు నెలల టైం మిగిలి ఉంది. ఈ వ్యవధిలో ట్రంప్ తన మంత్రిమండలి కోసం రిపబ్లికన్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను ఎంపిక చేసుకోనున్నారు. ఇందుకోసం అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసేందుకు ఒక ప్రత్యేక టీమ్‌ను ట్రంప్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ టీమ్‌లో కాబోయే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ జూనియర్ ట్రంప్‌‌, రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్, రిపబ్లికన్ పార్టీ నాయకురాలు తులసీ గబార్డ్, ట్రంప్ సన్నిహిత వ్యాపారవేత్త హోవార్డ్ లుట్నిక్, గతంలో ట్రంప్ ప్రభుత్వంలో పనిచేసిన లిండా మెక్‌మాహన్ ఉన్నారు. రిపబ్లికన్ పార్టీలోని కొందరు భారత సంతతి నేతల(Indian Americans) పేర్లు కూడా ట్రంప్ క్యాబినెట్ స్క్రీనింగ్ టీమ్ పరిశీలనలో ఉన్నాయి.. వారెవరో తెలుసుకుందాం..

వివేక్ రామస్వామి

ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌తో భారత సంతతి నేత వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) పోటీపడ్డారు. అయితే చివరిదాకా పోటీలో కొనసాగలేదు. ట్రంప్‌కు తన మద్దతును ప్రకటించి, అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకున్నారు. అమెరికాలో వివేక్ రామస్వామికి బయోటెక్ కంపెనీలు ఉన్నాయి. అమెరికా హోం శాఖ (హోంల్యాండ్ సెక్యూరిటీ)ను వివేక్‌కు కేటాయిస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి.

నిక్కీ హేలీ

మాజీ సౌత్ కరోలినా గవర్నర్, భారత సంతతి రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ(Nikki Haley).. ట్రంప్‌నకు సన్నిహితురాలు. గతంలో ట్రంప్ హయాంలో ఆమె ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా వ్యవహరించారు. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం నిక్కీ హేలీ కూడా ట్రంప్‌తో పోటీ పడ్డారు. ఈమె కూడా వివేక్ రామస్వామిలాగే.. మధ్యలోనే పోటీ నుంచి తప్పుకున్నారు.

తులసీ గబార్డ్

భారత సంతతి నాయకురాలు తులసీ గబార్డ్ గతంలో డెమొక్రటిక్ పార్టీలో పనిచేశారు. ప్రస్తుతం ట్రంప్ టీమ్‌లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ట్రంప్‌కు ప్రచార వ్యూహాలను అందించిన ప్రత్యేక టీమ్‌లో తులసి కూడా ఉన్నారు. తనకు విధేయంగా ఉన్న తులసికి ట్రంప్.. ఏదైనా బాధ్యతను అప్పగించే అవకాశం లేకపోలేదు.

కశ్యప్ పటేల్

భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్ ఒక న్యాయవాది. ట్రంప్‌కు వీర విధేయుడు అనే ట్యాగ్ ఈయనకు ఉంది. అందుకే ఈసారి సీఐఏ చీఫ్ పదవిని కశ్యప్‌కు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ట్రంప్ హయాంలో 2019 ఫిబ్రవరిలో అమెరికా జాతీయ భద్రతా మండలిలోని ఉగ్రవాద నిరోధక విభాగం డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం కశ్యప్‌కు ఉంది.

బాబీ జిందాల్

లూసియానా రాష్ట్ర మాజీ గవర్నర్, భారత సంతతి నేత బాబీ జిందాల్‌కు ట్రంప్ క్యాబినెట్‌లో బెర్తు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈయనకు ఆరోగ్య, మానవ సేవల శాఖను కేటాయిస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. ట్రంప్‌కు చెందిన ‘అమెరికా ఫస్ట్ పాలసీ ఇన్‌స్టిట్యూట్’‌లోని ‘సెంటర్ ఫర్ ఎ హెల్తీ అమెరికా’ విభాగాన్ని ప్రస్తుతం బాబీ జిందాల్ లీడ్ చేస్తున్నారు.

Tags:    

Similar News