India: భారత్‌లో మైనారిటీలపై దాడులు.. అమెరికా సంస్థ రిపోర్టును ఖండించిన భారత్
భారత్‌లో మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయని అమెరికా కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ రిలీజ్ చేసిన నివేదికపై భారత్ స్పందించింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లో మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయని అమెరికా కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (USCIRF) రిలీజ్ చేసిన నివేదికపై భారత్ తీవ్రంగా స్పందించింది. యూఎస్ ప్యానెల్ రిపోర్ట్ పక్షపాతంతో, రాజకీయంగా ప్రేరపించబడేలా ఉందని అభివర్ణించింది. ఈ నివేదికలోని అంశాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయని తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Ranadeer jaiswal) మాట్లాడుతూ యూఎస్‌సీఐఆర్ఎఫ్ మత స్వేచ్ఛపై ఆందోళన చెందుతున్నట్టు కనిపించడం లేదని తెలిపారు. కొన్ని ఘటనలకు తప్పుగా చిత్రీకరిస్తున్నారని, భారత్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యానికి చిహ్నంగా ఉన్న భారత్ ఖ్యాతిని దెబ్బతీసేందుకు పూనుకుంటున్నారని, ఇటువంటి ప్రయత్నాలు విజయవంతం కాబోవని చెప్పారు. ‘భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. వారు వివిధ మతాలను అనుసరిస్తున్నారు. దేశంలో వివిధ మతాలు, కులాలు, వర్గాలు, సంస్కృతుల ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారు. ఈ విషయాన్ని యూఎస్‌సీఐఆర్ఎఫ్ ఎప్పుడూ గుర్తించలేదు. నిరంతరం దేశంపై తప్పుడు ఆరోపణలే చేస్తోంది’ అని నొక్కి చెప్పారు.
యూఎస్‌సీఐఆర్ఎఫ్ రిపోర్టులో ఏముంది?
అంతర్జాతీయంగా మత స్వేచ్ఛపై పని చేసే యూఎస్‌సీఐఆర్ఎఫ్ 2025కు సంబంధించిన వార్షిక నివేదికను తాజాగా విడుదల చేసింది. తన రిపోర్టులో భాగంగా భారత్‌ను ప్రత్యేక ఆందోళనకరమైన దేశంగా ప్రకటించాలని తెలిపింది. భారత్‌లో మత స్వేచ్ఛ క్షిణిస్తోందని, మతపరమైన మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని, వివక్ష పెరుగుతోందని పేర్కొంది. 2024లో లోక్ సభ ఎన్నికల వేళ ఈ ఘటనలు మరింత ఎక్కువయ్యాయని తెలిపింది. ఎన్నికల ప్రచారం సమయంలో బీజేపీ ముస్లింలు, ఇతర మతపరమైన మైనారిటీలపై బీజేపీ ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిందని వెల్లడించింది. అంతేగాక భారత్ నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) కూడా ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాదులను చంపడానికి కుట్ర పన్నిందని ఆరోపించింది. కాబట్టి ‘రా’ పై ఆంక్షలు విధించాలని సిఫార్సు చేసింది.