ఉప ఎన్నికల్లో ‘ఇండియా’ హవా..ఆ రాష్ట్రంలో బీజేపీకి షాక్

దేశ వ్యాప్తంగా పలు కారణాల వల్ల ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలో ఇండియా కూటమి సత్తా చాటింది. మొత్తం 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా..

Update: 2024-07-13 14:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ వ్యాప్తంగా పలు కారణాల వల్ల ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలో ఇండియా కూటమి సత్తా చాటింది. మొత్తం 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా.. అందులో 10 సీట్లను కైవసం చేసుకుంది. గత నెలలో కేంద్రంలో రికార్డు స్థాయిలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. పశ్చిమ బెంగాల్‌లోని 4, హిమాచల్ ప్రదేశ్ లోని 3, ఉత్తరాఖండ్‌లోని 2, బిహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు, పంజాబ్‌లోని ఒక్కో స్థానానికి ఈ నెల 10న బైపోల్స్ జరగగా..శనివారం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించారు. దీంతో ఇండియా కూటమి అత్యధిక సీట్లు గెలుచుకోగా, బీజేపీకి షాక్ తగిలినట్టు అయింది.

బెంగాల్‌లో టీఎంసీ క్లీన్ స్వీప్

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మరోసారి సత్తా చాటింది. రాష్ట్రంలోని రాయ్ గంజ్, రాణాఘాట్ దక్షిణ్, బాగ్దా, మానిక్ టలా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగగా అన్ని స్థానాల్లోనూ టీఎంసీ అభ్యర్థులే గెలుపొందారు. గతంలో ఈ స్థానాల్లో బీజేపీకి 3 సీట్లు ఉండగా అన్నింటినీ కోల్పోవడం గమనార్హం. ఇక, ఉత్తరాఖండ్‌లోని బధ్రీనాథ్, మంగళూరు రెండు సెగ్మెంట్లలో ఎలక్షన్స్ జరగగా..రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలుపొందింది. పంజాబ్‌లోని జలంధర్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్‌ భగత్‌, తమిళనాడులోని విక్రావండిలో డీఎంకే అభ్యర్థి అన్నియుర్‌ శివ, బిహార్‌లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంక్‌ సింగ్‌, మధ్యప్రదేశ్‌లోని అమర్వారాలో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు.

హిమాచల్‌లో పట్టు నిలుపుకున్న కాంగ్రెస్

హిమాచల్ ప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా దానికి ఎట్టకేలకు తెరపడింది. ఇక్కడ దేహ్రా, హమీర్ పూర్, నాలాగఢ్‌లలో ఉప ఎన్నికలు జరగగా..ఒక స్థానంలో బీజేపీ, రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందాయి. దోహ్రా సెగ్మెంట్‌లో సీఎం సుఖ్వింధర్ సింగ్ సుఖు భార్య కమలేష్ ఠాకూల్ విజయం సాధించారు. హమీర్‌పూర్ సీటును బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో ఈ మూడు స్థానాల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకున్న బీజేపీకి నిరాశే ఎదురైంది.

ఇండియా వైపే ప్రజలు: రాహుల్ గాంధీ

అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఇండియా కూటమి విజయంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల రాజకీయ విశ్వసనీయత పడిపోతుందనడానికి ఉప ఎన్నికల ఫలితాలు బలమైన నిదర్శనమని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఇండియా కూటమికి మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాహుల్ గాంధీ స్పందిస్తూ..ఏడు రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలతో బీజేపీ అల్లిన భయం, గందరగోళం బద్దలయ్యాయని తెలిపారు. ‘రైతులు, యువకులు, కార్మికులు సహా ప్రతి ఒక్కరూ నియంతృత్వాన్ని పూర్తిగా నాశనం చేసి న్యాయ పాలనను స్థాపించాలని కోరుకుంటున్నారు. ప్రజలు తమ జీవితాల మెరుగుదల, రాజ్యాంగ పరిరక్షణకు ఇండియా కూటమితో పూర్తిగా నిలబడుతున్నారు’ అని పేర్కొన్నారు. ద్వేషాన్ని వ్యాప్తి చేయడం వల్లే బీజేపీని ప్రజలు నిరంతరం తిరస్కరిస్తున్నారని కాంగ్రెస్ నేత చిదంబరం అని అన్నారు. 

Tags:    

Similar News