న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుష్టు రోగుల్లో దేశంలోనే సగానికి పైగా ఉన్నట్లు జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమం నివేదిక వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 2019-20 లో దాదాపు 80 శాతం (1,14,451) కేసులు ఆగ్నేయాసియా దేశాల్లో నమోదైనట్లు పేర్కొంది. ఇక కొత్త కేసులు దేశంలో బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో 76 శాతం పైగా కేసులు ఉన్నట్లు తెలిపింది. ఇక 2020-21 లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సేకరించిన నివేదికల ఆధారంగా లక్ష మందిలో 4.56 శాతం కేసులు ఉన్నట్లు వెల్లడించింది. మొత్తం ఏడాదిలో 65,147 కొత్త కేసులను గుర్తించినట్లు తెలిపింది.
అయితే సరైన సమయంలో వ్యాధిని గుర్తిస్తే 6 నుంచి 12 నెలల్లో వ్యాధిని తగ్గించే అవకాశం ఉంది. శివానంద నిర్మూలన గృహం సీఎంవో అనంత్ రెడ్డి మాట్లాడుతూ.. '2005లో భారత్ కుష్టు రహిత దేశంగా ప్రకటించబడింది. మహమ్మారి పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. ప్రస్తుతం వ్యాధికి అపరేషన్లు చేసే నిపుణుల సంఖ్య తక్కువగా ఉంది. కుష్టు వ్యాధికి వ్యతిరేకంగా మన పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అవగాహన కల్పించి, వ్యాధి సోకిన వారిని చికిత్స కోసం ముందుకు వచ్చేలా ప్రోత్సహ కార్యక్రమాలు చేపట్టాలని నిపుణులు నొక్కి చెప్పారు. ప్రతి ఏటా జనవరి 30న ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవంగా నిర్వహిస్తారు. ఈఏడాదికి గానూ, 'గౌరవం కోసం ఐక్యత' థీమ్‌గా ఉంది.