కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగ‌ణ‌న : రాహుల్ గాంధీ

దేశం సమగ్ర అభివృద్ధి కోసం, పేదరిక నిర్మూలన కోసం అత్యవసరంగా తీయాల్సిన ‘ఎక్స్ రే’ కులగణన అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.

Update: 2023-10-09 11:41 GMT

న్యూఢిల్లీ : దేశం సమగ్ర అభివృద్ధి కోసం, పేదరిక నిర్మూలన కోసం అత్యవసరంగా తీయాల్సిన ‘ఎక్స్ రే’ కులగణన అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహణకు తాము అనుకూలమని ఆయన వెల్లడించారు. సోమవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడ‌బ్ల్యూసీ) స‌మావేశం అనంత‌రం ఆయన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్‌లలోని ముఖ్యమంత్రులు ఇప్పటికే కులగణనకు మద్దతు ప్రకటించారనే విషయాన్ని రాహుల్ గుర్తు చేశారు. నాలుగు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉంటే.. వాటిలో మూడుచోట్ల ఓబీసీలే సీఎంలుగా ఉన్నారని చెప్పారు.

10 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఓబీసీ కేటగిరీకి చెందిన సీఎం ఒక్కరే ఉన్నారని తెలిపారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కులగణన చేయాలనే ఉద్దేశమే లేదు. ప్రధాని ఓబీసీల కోసం పని చేయరు.. ఇతరులను పని చేయనివ్వరు’’ అని రాహుల్ కామెంట్ చేశారు. కాగా, సీడబ్ల్యూసీ సమావేశంలో కుల గ‌ణ‌న‌తో పాటు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. స‌మావేశంలో రాజ‌స్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల సీఎంల‌తో పాటు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల సీఎల్పీ నేత‌లు పాల్గొన్నారు.


Similar News