Lottery King: మొబైల్, ల్యాప్ టాప్ డేటాను కాపీ చేయొద్దు- సుప్రీంకోర్టు

మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ‘లాటరీ కింగ్‌’ శాంటియాగో మార్టిన్‌(Lottery King Santiago Martin) కేసులో కీలక ఉత్తర్వులు వెలువరించింది.

Update: 2024-12-25 08:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ‘లాటరీ కింగ్‌’ శాంటియాగో మార్టిన్‌(Lottery King Santiago Martin) కేసులో కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఆయన మొబైల్‌, ల్యాప్‌టాప్‌లోని డేటాను సేకరించకుండా, కంటెంట్‌ కాపీ చేయకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలిచ్చింది. ఆయన నుంచి సేకరించిన ఎలక్ట్రానిక్‌ పరికరాల్లోని సమాచారాన్ని యాక్సెస్‌ చేయొద్దని, దాన్ని కాపీ చేసుకోవద్దని ఈడీకి సూచించింది. సోదాల్లో ఇలాంటి పరికరాల స్వాధీనాలకు సంబంధించి కొన్ని కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లతో కలిపి మార్టిన్‌ కేసును విచారిస్తామని కోర్టు తెలిపింది. ఈ కేసుపై విచారణను వాయిదా వేసింది. శాంటియాగో మార్టిన్‌కు చెందిన ఫ్యూచర్‌ గేమింగ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పలు మోసాలకు పాల్పడిందని గతంలోనే ఆరోపణలు వచ్చాయి. కాగా.. 2014లో సీబీఐ కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా 2018లో మార్టిన్‌ సహా ఏడుగురిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఆ కేసు దర్యాప్తులోభాగంగా ఈ ఏడాది నవంబరులో తమిళనాడు, హర్యానా, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌లోని మార్టిన్‌ కార్యాలయాలు, ఇతర ఆస్తుల్లో ఈడీ సోదాలు చేపట్టింది. తనిఖీల్లో రూ.8.8 కోట్ల నగదుతో పాటు మొబైల్‌, ల్యాప్‌టాప్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. అయితే, వాటి నుంచి ఎలాంటి సమాచారాన్ని సేకరించవద్దని ఈడీని నిలువరిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఎవరీ లాటరీ కింగ్

ఇకపోతే, ఎన్నికల బాండ్ల కేసులో ‘లాటరీ కింగ్‌’గా పేరొందిన శాంటియాగో మార్టిన్‌ పేరు తెరపైకి వచ్చింది. అతడి నేతృత్వంలోని ఫ్యూచర్‌ గేమింగ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు వరల్డ్‌ లాటరీ అసోసియేషన్‌లో సభ్యత్వం ఉంది. ఇది ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినో వంటి వాటిని నిర్వహిస్తుంది. ఈ సంస్థ నుంచి వచ్చిన ఆదాయంతో రూ.1300 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను మార్టిన్‌ కొనుగోలు చేశాడు. వాటిని 2019-2024 మధ్య పలు రాజకీయ పార్టీలకు విరాళంగా ఇచ్చినట్లు ఇటీవల వెల్లడైంది. తమిళనాడు అధికార డీఎంకే పార్టీకి అతడు రూ.509కోట్లు విరాళమిచ్చినట్లు తెలిసింది. ఫిబ్రవరిలో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎలక్టోరల్ బాండ్‌ల కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది.

Tags:    

Similar News