మరుగుదొడ్డి కడిగిన ఆస్పత్రి డీన్.. శివసేన ఎంపీ ఆదేశంతో క్లీనింగ్

Update: 2023-10-03 12:34 GMT

ముంబయి: మహారాష్ట్ర, నాందేడ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో 48 గంటల్లో 31 మంది మరణించగా.. ఎంపీ ఆదేశాలతో డీన్ స్వయంగా మరుగుదొడ్డిని శుభ్రపరిచారు. ఆస్పత్రిలో మరణాలకు సంబంధించి జాతీయస్థాయిలో వార్తలు రావడంతో శివసేన (షిండే వర్గం) ఎంపీ హేమంత్ పాటిల్ మంగళవారం శంకర్‌రావ్ చవాన్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు అపరిశుభ్రమైన టాయిలెట్‌ను గుర్తించిన పాటిల్.. శుభ్రం చేయాల్సిందిగా హాస్పిటల్ డీన్ శ్యామ్‌రావ్ వాకోడ్‌కు సూచించాడు. అంతేకాదు అతను టాయిలెట్‌ను క్లీన్ చేస్తున్నప్పుడు ఎంపీ అక్కడే ఉండి, పైప్‌‌తో నీళ్లు పట్టాడు. కాగా.. ఈ ఆస్పత్రిలో 24 గంటల్లో (సోమవారం) 24 మరణాలు నమోదయ్యాయి. మంగళవారం ఈ సంఖ్య 48 గంటల్లో 31 కి పెరిగింది. మరో 71 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే వైద్యపరమైన నిర్లక్ష్యం జరిగిందనే ఆరోపణలను డీన్ శ్యామ్‌రావు తిరస్కరించారు.

మందులు, వైద్యుల కొరత లేదని వెల్లడించారు. రోగులకు సరైన వైద్యమే అందించామని.. కానీ చికిత్సకు స్పందించలేదని తెలిపారు. అయితే మరణాల సంఖ్య అధికంగా ఉండటంతో ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ప్రచారానికి వేల కోట్లు ఖర్చు చేస్తుంది, కానీ పిల్లలకు మందులు కొనడానికి డబ్బు లేదా అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పటికే ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. కాగా.. మృతులపై దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేసినట్లు మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ దిలీప్ మైసేకర్ తెలిపారు.


Similar News