న్యాయస్థానాల విచారణ తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కోర్టు ధిక్కార కేసుల విచారణ తీరుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Update: 2023-07-30 16:12 GMT

న్యూఢిల్లీ : కోర్టు ధిక్కార కేసుల విచారణ తీరుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులలో అధికార పరిధిని వినియోగించుకునే క్రమంలో న్యాయస్థానాలు అతి సున్నితంగా ఉండకూడదని, భావోద్వేగాలకు తావివ్వకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడంటూ ఓ వైద్యుడి లైసెన్స్‌ను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ న్యాయమూర్తుల బెంచ్ తీర్పు ఇచ్చింది.

ఆస్పత్రికి సంబంధించిన అక్రమ నిర్మాణ భాగాన్ని కూల్చేయాలని ఇచ్చిన ఆదేశాల్ని ఓ వైద్యుడు పాటించకపోవడాన్ని కలకత్తా హైకోర్టు సింగిల్ బెంచ్ కోర్టు ధిక్కారంగా పరిగణించి, అతడి లైసెన్సు ను రద్దు చేస్తూ గతంలో తీర్పు ఇచ్చింది. దీనిపై వైద్యుడు సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. లైసెన్స్‌ రద్దు తీర్పును కొట్టేసింది. కోర్టులు అనుభవిస్తున్న ధిక్కార అధికార పరిధి అనేది ప్రస్తుత న్యాయవ్యవస్థ విశ్వాసాన్ని నిలబెట్టేందుకు మాత్రమే ఉద్దేశించబడిందని స్పష్టం చేసింది.


Similar News