పార్టీల ఉచిత హామీలపై శ్వేతాపత్రం విడుదల చేయాలి: దువ్వూరి సుబ్బారావు

దీనికోసం ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు.

Update: 2024-04-21 08:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉచితాల విషయంలో రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చేలా కేంద్రం 'శ్వేతపత్రం' విడుదల చేయాలని, ఈ విషయంలో రాజకీయ పార్టీలపై ఆంక్షలు ఎలా విధించాలనే దానిపై సమగ్ర చర్చ జరగాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ డి సుబ్బారావు డిమాండ్ చేశారు. దీనికోసం ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. ఉచితాల ఖర్చు, ప్రయోజనాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని, ఈ బాధ్యత ప్రభుత్వానిదేనని సుబ్బారావు అన్నారు. 'ఇది అంతిమంగా రాజకీయ సమస్య అని నేను భావిస్తున్నాను, దీనిపై రాజకీయ ఏకాభిప్రాయం ఉండాలి. నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి తీసుకోవాలి. వారు ఒక శ్వేతపత్రాన్ని తేవాలని' తెలిపారు. భారత్ లాంటి పేద దేశంలో అత్యంత బలహీనవర్గాలను కొన్ని రకాల భద్రతలను కల్పించడం ప్రభుత్వ బాధ్యని స్పష్టం చేశారు. అదే సమయంలో ఆర్థిక పరిస్థితులను బట్టి ఉచితాలు ఎంతవరకు విస్తరించాలనే దానిపై సమీక్ష జరుపుకోవాలన్నారు. కాబట్టి ఉచితాలపై మరింత బలమైన చర్చలు జరపాలని, రాజకీయ పార్టీలపై ఎంతో కొంత నియంత్రణను ఎలా విధించగలమనే దానిపై సమీక్ష జరగాలని' అని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఎఫ్ఆర్‌బీఎం పరిమితులను కొన్ని రాష్ట్రాలు అధిగమిస్తున్న అంశంపై మాట్లాడిన సుబ్బారావు, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం సైతం ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు.

2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలంటే ఏడాదికి 7.6 శాతం వృద్ధి రేటు అవసరమని తెలిపారు. భౌగోళిక రాజకీయాలు, వాతావరణ మార్పుల వంటి సవాళ్ల మధ్య భారత్ దీన్ని ఎంతమేరకు కొనసాగిస్తుందనేది చెప్పలేమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన ఒక దేశానికి చట్టబద్ధమైన పాలన, బలమైన ప్రభుత్వం, ప్రజాస్వామ్య జవాబుదారీతనం, సంస్థలు కీలకమైన నాలుగు స్తంభాలని సుబ్బారావు వెల్లడించారు. 'అవి లేవని చెప్పలేము, ఉన్నాయనీ చెప్పలేము. కాబట్టి వాటిని మరింత సమర్థవంతంగా చూసుకోవాలని' అని ఆయన అన్నారు.

Tags:    

Similar News