IMD: 1901 తర్వాత 2024లోనే భారత్‌లో అత్యంత వేడి.. వెల్లడించిన ఐఎండీ
1901తర్వాత భారత్‌లో 2024 ఏడాది అత్యంత వేడి సంవత్సరంగా నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
దిశ, నేషనల్ బ్యూరో: 1901తర్వాత భారత్‌లో 2024 ఏడాది అత్యంత వేడి సంవత్సరంగా నమోదైందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. గతేడాది సగటు కనిష్ట ఉష్ణోగ్రత 0.90 డిగ్రీలు సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైందని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. 2024లో సగటు వార్షిక ఉష్ణోగ్రత 25.75 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, ఇది సాధారణ ఉష్ణోగ్రత పరిధి కంటే 0.65 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. అలాగే సగటు ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.54 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైన 2016ని అధిగమించి రికార్డు సృష్టించిందని తెలిపారు. ‘2024లో భారత్‌పై వార్షిక సగటు భూ ఉపరితల గాలి ఉష్ణోగ్రత దీర్ఘకాలిక సగటు (1991-2020 ) కంటే 0.65 డిగ్రీల సెల్సియస్‌గా ఎక్కువగా ఉంది. కాబట్టి 2024 అత్యధిక ఉష్ణోగ్రతల సంవత్సరంగా నమోదైంది’ అని పేర్కొన్నారు. తూర్పు, వాయువ్య, పశ్చిమ మధ్య ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలు మినహా జనవరిలో దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.